కరీంనగర్: గంగాధర మండలంలో గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం policeportal.tspolice.gov.in వెబ్‌సైట్లో మండపానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి, దరఖాస్తును సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియ భద్రతాపరమైన ఏర్పాట్లకు సహాయపడుతుందన్నారు. కచ్చితంగా మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు.
Author: Shivaganesh
-
‘ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి’
పెద్దపల్లి: ఓదెల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సై దీకొండ రమేష్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. చదువు చెప్పిన గురువులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. చిన్నచిన్న విషయాలకు ఆవేదన చెందకుండా మంచి ఆలోచనతో చదువుకోవాలని విద్యార్థులకు తెలిపారు.
-
ప్రవేశాలకు గడువు పొడిగింపు
మెదక్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయని వివరించారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యత విద్యను పొందాలని సూచించారు.
-
నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు..
మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన నల్లపోచమ్మ దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. అమ్మవారికి పుష్పాలతో అలంకరణ చేసి, కుంకుమ అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితదరులు పాల్గొన్నారు.
-
సిద్దిపేటలో దొంగల ముఠా అరెస్ట్..
సిద్దిపేట: పగలు క్యాటరింగ్ పనులు చేస్తూ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను సిద్దిపేట టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకురి సూర్య (38), ఎస్కే సాజిద్ (32), మహమ్మద్ హరిఫ్(21), సుభాష్(40)లు ఒక ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఠాను అరెస్ట్ చేసి నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
-
తపస్ ఆధ్వర్యంలో రేపు నిరసన
మెదక్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని తపస్ రాష్ట్ర శాఖ పిలుపు నేపథ్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు. శనివారం పాఠశాలల్లో నల్ల బ్యాడ్జిలతో నిరసన, తహసీల్దార్లకు వినతి పత్రం, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం సభ్యులకు పిలుపునిచ్చారు.
-
సొంత అన్నపై కత్తితో దాడి..
సంగారెడ్డి: పటాన్‌చెరులోని రుద్రారంలో ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. రుద్రారం గ్రామానికి చెందిన షేక్ బాబా, తన సోదరుడు షేక్ బాబర్ ఆస్తులు అమ్ముతున్నాడని నిలదీయగా, కోపోద్రిక్తుడైన బాబర్ కత్తితో దాడి చేశాడు. కుటుంబసభ్యులు అడ్డుకుని గాయపడ్డ బాబాను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
ఓదెల మల్లికార్జునుడికి లక్ష బిల్వార్చన
పెద్దపల్లి: ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా 150 జంటలు బిల్వ పత్రాలతో ఈ అర్చనలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ సదయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
-
సిగ్నల్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్యదర్శి
ములుగు: ఫోన్ సిగ్నల్ సమస్యతో ఓపంచాయతీ కార్యదర్శి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన గురువారం ఏటూరునాగారం మండలం దొడ్లలో వెలుగుచూసింది. పంచాయతీ కార్యదర్శి సతీశ్ కుమార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫొటోలను అప్లోడ్ చేయడానికి గ్రామంలో సరైన సిగ్నల్ లేకపోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ఫొటోలను సకాలంలో అప్లోడ్ చేయాలని, వేరే మార్గం లేక వాటర్ ట్యాంక్ ఎక్కినట్లు తెలిపారు.
-
మేడిగడ్డకు తగ్గిన వరద ప్రవాహం
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం 6 గంటలకు 6,21,840 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,70,000 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గిందని పేర్కొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో బ్యారేజీకి ప్రవాహం వస్తోందన్నారు.