వరంగల్: గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటాయి. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ వద్ద 9,89,620 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ములుగు రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. అధికారులు పరివాహక గ్రామాలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజాము నుంచి వరద నిలకడగా ఉంది.
Author: Shivaganesh
-
చెరువు కట్టలను పరిశీలించిన కలెక్టర్..
మెదక్: భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, చెరువుల కట్టలను బాగు చేసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం ఆయన అల్లాదుర్గ్ మండలం, బట్టికుంట, చిల్వర్ గ్రామంలోని చెరువు కట్టలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వరదలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-
చికిత్స పొందుతూ వివాహిత మృతి
వరంగల్: చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన బుధవారం చింతనెక్కొండ గ్రామంలో వెలుగుచూసింది. నెక్కొండ మండలం బంజరుపల్లికి చెందిన మధులత (39) కుటుంబ సమస్యల కారణంగా గత నెల 24న గడ్డిమందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. మృతురాలి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
నిబంధనలు పాటించని వారికి నోటీసులు..
హన్మకొండ: జిల్లాలో కుక్కల పెంపకం, సంతానోత్పత్తి చేసి అమ్మేవారు, పెంపుడు జంతువుల దుకాణాలపై బుధవారం జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాంపూర్, మడికొండ, వడ్డేపల్లి, శ్రీనగర్‌కాలనీ, అశోక్‌కాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట, హసన్‌పర్తి, సుధానగర్ ప్రాంతాల్లో పలు డాగ్ బ్రీడింగ్ సెంటర్లను పరిశీలించి, నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
-
‘జిల్లాలో 900 మెట్రిక్ టన్నుల యూరియా’
మెదక్: జిల్లాలో యూరియా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన టేక్‌మాల్‌లో పర్యటించి మాట్లాడారు. జిల్లాలో 900 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, రానున్న 10రోజుల్లో జిల్లాకు 1500 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేసి సహకరించాలని ఫర్టిలైజర్ యజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మారెడ్డి, పడకంటి కిష్టయ్య పేర్కొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పాల్గొని ఉచిత పరీక్షలు చేయించుకొని, మందులు తీసుకోవాలన్నారు.
-
రేపు ఉద్యోగ మేళా
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎంపీడీఓ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండి 24 నుంచి 32 ఏళ్లలోపు ఉన్న వాళ్లు అర్హులు అన్నారు.
-
రైతులతో కలిసి మాజీ ఎంపీ నిరసన
మహబూబాబాద్: నెల్లికుదురు మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుందని, గతంలో ఇంటికే యూరియా వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టాలు పడాల్సి వస్తుందని విమర్శించారు. రైతులకు కొరత లేకుండా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
-
‘మహా జాతర లోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి’
ములుగు: మల్లంపల్లి వద్ద కెనాల్ పై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈసందర్భంగా పలువురు ప్రయాణికులు, స్థానికులు మాట్లాడుతూ.. బ్రిడ్జి కూలిపోవడంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారని, దీంతో దూరభారం పెరిగిందన్నారు. తాత్కాలిక రోడ్డు నిర్మించినప్పటికీ, చిన్న వాహనాలకే అనుమతిస్తున్నట్లు తెలపారు. జనవరిలో జరిగే మేడారం మహా జాతర లోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.
-
పొట్టు పొట్టు కొట్టుకున్నారు.!
ఖమ్మం: భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా రెండు వర్గాలకు చెందిన వారు పొట్టుపొట్టు కొట్టుకున్న ఘటన కూసుమంచి మండల కేంద్రంలో వెలుగుచూసింది. దంపతుల మధ్య పంచాయితీని పరిష్కరించడానికి ఇరువర్గాలు బుధవారం సమావేశం అయ్యాయి. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఘర్షణగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.