Author: Shivaganesh

  • టెక్కలి డీఎస్పీగా లక్ష్మణరావు

    శ్రీకాకుళం: టెక్కలి డీఎస్పీగా లక్ష్మణరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మూర్తి పదవీ విరమణ చేయగా ఆయన ఆస్థానంలో లక్ష్మణరావు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • అదృశ్యమైన నలుగురు విద్యార్థులు సేఫ్..

    తిరుపతి: అదృశ్యమైన నలుగురు విద్యార్థుల కేసును తిరుపతి టూటౌన్ పోలీసులు కేవలం రెండు గంటల్లో ఛేదించారు. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నుంచి పారిపోయి వచ్చిన నలుగురు విద్యార్థులు తిరుమలకు వచ్చారు. వారిని తిరుమల పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతికత సహాయంతో గుర్తించి, అనంతపురం పోలీసులకు అప్పగించారు. కేవలం రెండు గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

  • వైసీపీ నాయకులకు రిమాండ్

    చిత్తూరు: హత్యా ప్రయత్నం కేసులో ఆరుగురు వైసీపీ నాయకులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. గంగాకాలనీలో కాలనీవాసులపై హత్యాప్రయత్నం చేసిన గంగన్నపల్లికి చెందిన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ సుకూర్, రాజేష్, అరుణ్ కుమార్, సతీష్, అల్తాఫ్, రఘులను అరెస్టు చేసి చిత్తూరు IIIrd ADMM కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. వారికి జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

  • తిరుచ్చిపై ఊరేగిన పద్మావతిదేవి

    తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిచ్చారు. ఊరేగింపులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

  • చిన్నారిపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

    ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని శుక్రవారం సూళ్లూరుపేటలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ఆరంభాకంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతను అక్కడి నుంచి పారిపోయాడు.  సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో అతను ఉన్నట్లు సమాచారం రావడంతో తమిళనాడు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

     

  • ‘పాఠశాలల మూసివేత నిలిపివేయాలి’

    చిత్తూరు: కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని ఎస్సీ, ఎస్టీల సమస్యలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. కంచరపాలెంలో గృహపట్టాల పంపిణీ, అంబేద్కర్ భవనాలకు స్థల కేటాయింపు, రేషనలైజేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ కాలనీల పాఠశాలల మూసివేత నిలిపివేయాలని కోరారు. నాగలాపురం – చిన్నపాండూరు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.

  • మంత్రి వంగలపూడి అనితకు ఘన స్వాగతం

    తిరుపతి: హోం మంత్రి వంగలపూడి అనితకు రేణిగుంట రైల్వే స్టేషన్‌లో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మంత్రి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విజయవాడ నుంచి వందే భారత్‌ట్రైన్‌లో రేణిగుంట రైల్వేస్టేషన్ చేరుకున్నారు. మంత్రిని రైల్వేస్టేషన్‌లో టీడీపీనాయకులు, కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సత్కరించి, స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గాన తిరుమల బయలుదేరి వెళ్లారు.

  • బదిలీ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    శ్రీకాకుళం: దండగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోన్నతి, బదిలీపై వెళ్తున్న తొమ్మిది మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఘన సన్మానం నిర్వహించారు. హెచ్ఎం కె.వీరభద్రరావు, లక్ష్మీకాంతంతో పాటు ఇతర ఉపాధ్యాయులు వివిధ పాఠశాలలకు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో హెచ్ఎం పిట్ట గంగన్న, తోటి ఉపాధ్యాయులు వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాదపూజ చేశారు.

  • ‘కేసుల దర్యాప్తులో సాంకేతికతను ఉపయోగించాలి’

    విజయనగరం: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో శుక్రవారం ఎస్పీ వకుల్ జిందాల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో శక్తి వారియర్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి, నేరప్రవృత్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, సిబ్బంది పాల్గొన్నారు.

  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై అవగాహన

    తిరుపతి: సత్యవేడులో శుక్రవారం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో త్రివిక్రమరావు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామ స్థితిస్థాపకత కార్యక్రమం ద్వారా పర్యావరణ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను సమతుల్యం చేయాలన్నారు. వెలుగు ఏపీఎం డాక్టర్ డాంగే యాదవ్ మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక, జీవనోపాధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘ మిత్రలు, వీవో లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.