Author: Rafi

  • ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

    వరంగల్: అనారోగ్య కారణాలతో వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నర్సంపేటలోని వరమ్మతోటలో వెలుగు చూసింది. వరమ్మతోటకు చెందిన మొలుగూరి భాగ్యమ్మ (68) ఐదేళ్లుగా రొమ్ము కాన్సర్‌తో బాధపడుతోంది. ఈక్రమంలో ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • గుండెపోటుతో రైతు మృతి

    మెదక్: పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన ఉస్తెపు స్వామి (45) అనే రైతు తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • కరెంట్ షాక్‌తో ఒకరి మృతి

    కరీంనగర్: కరెంటు షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం శంకరపట్నం మండలం వంకాయగూడెంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మూల రాకేశ్(28) శనివారం ఇంటి ముందున్న రేకుల షెడ్డు కింద నిల్చోగా, షెడ్డుకు ఆనుకుని ఉన్న సర్వీస్వైర్ నుంచి విద్యుత్తు ప్రసరించి రాకేశ్ ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

  • గుండెపోటుతో హోంగార్డు మృతి

    కరీంనగర్: గుండెపోటుతో హోంగార్డు మృతి చెందిన ఘటన చిగురుమామిడిలో వెలుగుచూసింది. చిగురుమామిడికి చెందిన కాశపాక సదానందం గత నాలుగు నెలలుగా కరీంనగర్‌లోని ఆర్ఐ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య సంధ్యారాణి, కొడుకు విశాల్, కూతురు పూజ ఉన్నారు.

  • వేటాడి.. కటకటాల పాలయ్యారు

    మెదక్: వన్యప్రాణులు వేటాడిన ఇద్దరిని శనివారం అరెస్టు చేసినట్లు నర్సాపూర్ అటవీ శాఖ రేంజ్ అధికారి అరవింద్ పేర్కొన్నారు. నర్సాపూర్ రేంజ్ పరిధిలోని వెంకట్రావ్‌పేట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్‌కు చెందిన రామ్, వెంకట్రావ్‌పేటకు చెందిన రమేష్ వన్యప్రాణులను వేటాడారు. ఈక్రమంలో వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిచినట్లు తెలిపారు.

  • వెల్దుర్తి కేజీబీవీలో 22న స్పాట్ అడ్మిషన్లు

    మెదక్: వెల్దుర్తి కేజీబీవీలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మొదటి సంవత్సరం తెలుగు మీడియం కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 22న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్ఓ ఫాతిమా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల వారు పదో తరగతి మార్కుల జాబితా, కుల, ఆధార్ కార్డు, ఇతర అవసరమైన పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

  • రేపటి ప్రజావాణి వాయిదా

    మెదక్: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 21 సోమవారం బోనాల పండగ సందర్భంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.

     

  • పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

    భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు కేజీబీవీలో ఖాళీగా ఉన్న రెండు టీచింగ్ పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ)ల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ఎస్ఓ పద్మజ తెలిపారు. అర్హులు ఆదివారం సాయంత్రం 4 గంటలలోగా కళాశాలలో దరఖాస్తులు అందించాలని తెలిపారు. సీఆర్ – ఇంగ్లిష్, పీజీసీఆర్ జువాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • వైరా కేవీకే కోఆర్డినేటర్‌గా సుచరితాదేవి

    ఖమ్మం: వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా డాక్టర్ టి.సుచరితాదేవి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి పోషకాహార విభాగాధిపతిగా ఉన్న సుచరిత బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో కోఆర్డినేటర్‌గా పని చేసిన రవికుమార్ అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు బదిలీ అయిన విషయం విదితమే. ఈక్రమంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

  • రేపు స్పాట్ అడ్మిషన్లు

    వరంగల్: చెన్నారావుపేట, సంగెం మండలాల్లోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇంటర్ ప్రవేశాల కోసం సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని స్పెషల్ ఆఫీసర్లు మెట్టుపల్లి జ్యోతి, నీలిమ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు నేరుగా వచ్చి అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్ నర్సింగ్), సీఈసీ విభాగాల్లో సీట్లు ఉన్నా యని పేర్కొన్నారు.