ఖమ్మం: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలైన ఘటన సోమవారం కారేపల్లిలో చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వస్తున్న బస్సు కారేపల్లి (కామేపల్లి) స్టేజీ వద్ద ఆగింది. ఆసమయంలో వెనుక నుంచి వస్తున్న యాష్ ట్యాంకర్ బస్సు వెనుక భాగంలో ఢీకొంది. ప్రమాదంలో బస్సుడ్రైవర్ అంజితో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం వైద్యశాలకు తరలించారు.
Author: Shivaganesh
-
ఈనెల 22న అర్చక ప్రవేశ ఇంటర్వ్యూలు
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వర దేవస్థానంలో ఈనెల 22న దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అయిదు ఆర్చకుల స్థానాలకు ప్రవేశ ఇంటర్య్వూలు జరగనున్నాయి. దేవస్థానంలో గతం నుంచి అర్చకుల కొరత వెంటాడుతున్న నేపథ్యంలో ఈనెల 22న ఇంటర్వూలు నిర్వహించి.. వెంటనే అర్చకులను నియామకం చేపట్టనున్నట్లు అధికారుతు తెలిపారు. శుభ శ్రావణమాసంలో ఆలయంలో భక్తుల రద్దీ పెరగనుండడంతో దేవాదాయశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
-
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
జనగామ: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన చిల్పూర్ మండలం వెంకటేశ్వరపల్లె శివారులో సోమవారం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన ఎండీ అర్షద్(23) వెంకటేశ్వరపల్లె శివారులోని పొలాల వద్ద 132 కేవీ విద్యుత్తు లైన్‌పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గరై తీవ్రంగా గాయపడ్డాడు. అటువైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రాజయ్య క్షతగాత్రుడిని చూసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
-
తాళం వేసిన ఇంట్లో చోరీ.. కేసు నమోదు
మెదక్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమవారం నార్సింగిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి బోళ్లశ్రీనివాస్ ఉదయం తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి పొలంవద్దకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చిచూడగా తాళం ధ్వంసం చేసి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారం, పదితులాల వెండి, రూ.10లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆమ్మద్ మోహినొద్దీన్ చెప్పారు.
-
ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట: వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతికి ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని డీఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఈనెల 29వ తేదీలోపు ప్రవేశం నిమిత్తం ఎంపిక పరీక్షలకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
వరంగల్: ఎల్బీనగర్, పెరుకవాడ విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరమ్మతుల కారణంగా షాదీఖానా, నర్సంపేటరోడ్, మోయిమ్పుర, టెలికాం కాలనీ, తిలక్‌రోడ్, భారత్‌గ్యాస్ గోదాం లైన్, బీరన్నకుంట, ఎస్ఆర్ఆర్‌తోట, శాంతినగర్, పెరుకవాడ ఏరియాల్లో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
పాము కాటుతో వివాహిత మృతి
ఖమ్మం: పాము కాటుతో వివాహిత మృతి చెందిన ఘటన సోమవారం పెనుబల్లి మండలం ముత్తగూడేంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గరిడి విజయలక్ష్మి (35) సోమవారం ఇల్లు ఊడుస్తుండగా కూలర్ కింద ఉన్న రక్తపింజర పాము కరిచింది. ఆమె భర్త నాగేశ్వరరావు పామును చంపాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని వైద్యశాలకు తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు.
-
అనుమానాస్పద మృతి.. బుల్లెట్లు లభ్యం
మెదక్: అనుమానాస్పదంగా స్థితిలో ఒకరి మృతదేహం లభ్యమైన ఘటన మెదక్-హైదరాబాద్ రోడ్డు పక్కన వెలుగుచూసింది. కొల్చారం మండలం వరిగుంతం శివారులో జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ అనిల్ (45) అనుమానాస్పదంగా మృతి చెందారు. మెదక్-హైదరాబాద్ రోడ్డు పక్కన అదుపుతప్పినట్లున్న కారులో ఆయన మృతదేహం లభించింది. ఘటనా స్థలంలో పోలీసులు నాలుగు బుల్లెట్లు గుర్తించారు. హత్య లేదా ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి ఇల్లెందు పట్టణంలోని చెరువుకట్ట సమీపంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అతివేగంగా వస్తున్న ఓ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గార్ల మండలం ముత్యాలగూడెంకు చెందిన సాగర్‌గా గుర్తించారు.
-
బెదిరింపుతో కలకలం..
హన్మకొండ: కాజీపేటలోని జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్)లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపింది. నిట్‌లో బాంబు పెట్టినట్లు మూడురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా బెదిరించారు. అధికారులు వెంటనే కాజీపేట పోలీసులకు సమాచారం అందించడంతో సోమవారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్ వై.సుధాకర్‌రెడ్డి నిపుణులతో కలిసి వెళ్లి తనిఖీలు చేశారు. అన్ని ప్రాంతాల్లో సోదాలు చేసి ఎటువంటి ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు.