కుమ్రంభీం: కాగజ్ నగర్ మండలం అందెల్లి-బట్టుపల్లి రహదారి గుంతలుపడి ప్రయాణానికి తీవ్ర అసౌకర్యంగా మారిందని స్థానిక ప్రజలు, పలువురు ప్రయాణికులు వాపోయారు. సమస్యపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు, జడ్పీ మాజీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు జేసీబీల సహాయంతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రోడ్డు మరమ్మతులపై విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి, వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Author: Shivaganesh
-
అటువైపు వెళ్తున్నారా? జాగ్రత్తా!
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటిమట్టం 12.220 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 9,02,550 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, భక్తులు నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరించారు.
-
ఆలయాల్లో చోరీల కలకలం..
మెదక్: ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఘటన రామాయంపేట మండల కేంద్రంలో వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మల్లన్న దేవాలయంలోకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు ధ్వంసం చేసి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. చోరీ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అలాగే స్థానికంగా ఉన్న హనుమాన్ దేవాలయంలో కూడా దొంగలు హుండీ ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
జాతీయ రహదారిపై లారీ బోల్తా..
నిర్మల్: జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన బుధవారం ఉదయం కుంటాల మండలంలో వెలుగుచూసింది. చాక్‌పెల్లి వద్ద మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రెయిన్ సహాయంతో లారీని తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
-
యూరియా కోసం బారులు తీరిన రైతులు..
మహబూబాబాద్: నెల్లికుదురు మండల కేంద్రంలోని కోపరేటివ్ సొసైటీ కార్యాలయం ముందు బుధవారం తెల్లవారు జామునుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. రాత్రి నుంచే రైతులు క్యూ లైన్ లో తమ స్థానాల్లో చెప్పులు పెట్టి యూరియా కోసం ఎదురు చూపులు చూస్తున్నట్లు సమాచారం. పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు సరిపడా యూరియా అందించాలని కోరారు.
-
రైతులకు యూరియా తిప్పలు..
మహబూబాబాద్: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పంటలకు అవసరమైన యూరియా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా దిగుమతి సమాచారంతో ఉదయం నుంచే రైతులు భారీగా తరలివచ్చారు. పలుచోట్ల వర్షంలో నిలబడటం, వ్యవసాయ కేంద్రం వద్దే రైతులు నిద్రించడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మెదక్: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు సంబంధించిన బీర సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో ఆయనకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో రూ. 60 వేల ఎల్ఓసీ చెక్కు మంజూరు అయ్యింది. స్థానిక నాయకులు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదగిరి, వెంకటేశం, రామచంద్రం, సత్యం, తదితరులు పాల్గొన్నారు.
-
‘కచ్చితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి’
మెదక్: రామాయంపేట మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీఐ వెంకటరాజా గౌడ్ సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారులపై అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వెళ్లేలా దారి వదిలేసి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కచ్చితంగా అందరూ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
-
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఫోటో గ్రాఫర్స్ డే వేడుకలు
ఖమ్మం: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫోటో గ్రాఫర్స్ డే సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో సీనియర్ ఫోటో గ్రాఫర్స్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతం, వర్తమానం, భవిష్యత్తులకు సాక్ష్యంగా నిలిచేది ఫోటో అని అన్నారు. అలాంటి అపూర్వ చిత్రాలను కెమెరాలతో బంధిస్తున్న ఫోటో గ్రాఫర్స్‌ను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మెదక్: చిలిపిచెడు మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన అంతిరెడ్డిగారి భాగ్యమ్మకు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు అయ్యింది. ఆ చెక్కును స్థానిక నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జైపాల్, రమేష్, ప్రమోద్, సుభాష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.