Author: Shivaganesh

  • రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

    రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చక స్వాములు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, స్వామివారి ప్రసాదం అందజేశారు.

  • యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

    వరంగల్: పర్వతగిరి మండలం చౌటపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూస్తున్నట్లు వాపోయారు. పంటలకు అవసరమైన యూరియా నిల్వలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో పంట పెరుగుదలకు యూరియా చాలా అవసరమని, సరైన సమయంలో అందకపోతే దిగుబడి దెబ్బతింటుందని వాపోతున్నారు.

  • శాకంబరిగా నల్ల పోచమ్మ

    మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ఆషాడ మాసం ఆదివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. అమ్మవారు భక్తులకు శాకంబరిగా మాతగా దర్శనం ఇచ్చినట్లు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చనలు, ఓడిబియాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.

  • ధర్మపురిలో భక్తుల రద్దీ

    జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢ మాసం ఆదివారం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

  • ఈతమొక్కలు నాటిన ఆబ్కారీ అధికారులు

    మెదక్: హవెళ్లి ఘనపూర్ మండలం ముత్తైకోట శివారులో వన మహోత్సవంలో భాగంగా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 200 ఈతమొక్కలు నాటారు. కార్యక్రమంలో మెదక్ సీఐ సిహెచ్ నాగేశ్వరరావు, ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నాణ్యమైన కల్లు కోసం నాటిన మొక్కలు సంరక్షించాలని సూచించారు. కల్తీకల్లు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • సైబర్ వలకు చిక్కిన రైతు.. 

    సిద్దిపేట: సైబర్ నేరాగాళ్ల చేతిలో ఓ రైతు మోసపోయిన ఘటన శనివారం దుబ్బాక మండలం అప్పనపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ
    రైతు సెల్‌ఫోన్‌కు రత్నాకర్ బ్యాంక్ పేరుతో అగంతకులు ఫోన్‌చేసి, క్రెడిట్‌కార్డ్ ఛార్జీలు తగ్గించేందుకు లింక్ పంపినట్లు నమ్మించారు. రైతు లింక్‌ను రెండుసార్లు తెరవడంతో రూ.68,000 కోల్పోయాడు. వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించగా రూ.51,000 ఫ్రీజ్ చేసి, పోలీసులు కేసునమోదు చేశారు.
  • విద్యుత్తు సరఫరాకు అంతరాయం

    ములుగు: ములుగు పట్టణంలోని పలు కాలనీల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రవి తెలిపారు. ములుగులోని 11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ములుగు ఫీడర్-1 పరిధి శ్రీనివాసకాలనీ, ప్రగతికాలనీ, లారీ ఆఫీసు, ప్రేమనగర్, కొత్త కలెక్టర్ కార్యాలయం, పత్తి మిల్లులు, వీవర్స్ కాలనీ, క్యాంపు ఆఫీసు,  తదితర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

  • ఈనెల 14న తారా కళాశాలలో ఉద్యోగమేళా 

    సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. ఉద్యోగ మేళాకు డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ చదివిన అభ్యర్థులు అర్హలన్నారు.  ఎంపికైన వారికి శ్రీ చైతన్య విద్యా సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అవకాశాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

     

  • ‘ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్’

    మెదక్: జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో నవజాతు శిశువుల ప్రత్యేక విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన నవజాతశిశువులకు అందుతున్న వైద్యసేవలు గురించి సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గైనికల్ సేవలే కాకుండా మిగిలిన విభాగాలను సైతం బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

     

  • అంతర్గత అభ్యర్థులకు నేడు రాతపరీక్ష

    భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం సింగరేణిలో అండర్ మేనేజర్ పోస్టుల భర్తీ నిమిత్తం అంతర్గత అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 33 అండర్ మేనేజర్ పోస్టుల భర్తీకి 234 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు పొందారు. విజిలెన్సు పర్సనల్ విభాగాధికారుల నిఘా మధ్య పరీక్ష కొనసాగనుంది. ఫలితాలను ఈరోజు అర్ధరాత్రిలోపు ప్రకటించనున్నాని అధికారులు తెలిపారు.