Author: Shivaganesh

  • జలకళ సంతరించుకున్న ఫాంపాండ్

    మెదక్: చిలపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో నిర్మించిన ఫాంపాండ్ వర్షాలతో నిండిపోయింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతు శశికాంత్ పొలంలో దీన్ని నిర్మించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఫాంపాండ్ రైతులకు సాగునీరు అందించడంతో పాటు, చేపల పెంపకం, భూగర్భ జలాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి ఫాంపాండ్స్ కావాలనుకునే రైతులు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

  • ‘మహాధర్నాను విజయవంతం చేయాలి’

    మెదక్: సీపీఎస్ రద్దు కోసం సెప్టెంబర్ 1న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.మల్లారెడ్డి పిలుపునిచ్చారు. హవేలీ ఘన్‌పూర్ మండల వనరుల కేంద్రంలో ఎంఈఓ నాచారం మధుమోహన్ ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, శివరాజ్, శశి కుమార్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • నివేదితకు నాట్యరత్న అవార్డు ప్రధానం..

    మెదక్: చెన్నైలో జరిగిన అంతర్జాతీయ నృత్యోత్సవంలో మెదక్‌కు చెందిన నృత్యకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న నృత్య గురువు నివేదితను నిర్వాహకులు ‘ నాట్య రత్న’ అవార్డుతో సత్కరించారు. అలాగే ఆమె శిష్యులైన అద్వైత్, శ్రీ హర్షిని, అనిక్ష, మృణాళిని, యానశ్రీలకు’ లాస్య జ్వాల’ అవార్డు లభించింది. ఈసందర్భంగా వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారని పలువురు అభినందనలు తెలిపారు.

  • జిల్లాలో మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం..

    మెదక్: జిల్లా పోలీసులకు రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసింది. ఈసందర్భంగా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేర పరిశోధనలో మరింత వేగం, కచ్చితత్వం కోసం ఈ వాహనం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వాహనంలో ఆధునిక పరికరాలతో సంఘటనా స్థలం నుండే కీలక సాక్ష్యాలు సేకరించి, తక్షణమే పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ఆయన మంగళవారం వాహనాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

    మెదక్: భారీ వర్షాలతో మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈక్రమంలో ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఘన్‌పూర్ అనకట్ట, పేరూరు ఎల్లాపూర్ బ్రిడ్జ్‌లను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని ప్రజలకు తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

  • ‘అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి’

    మహబాబూబాద్: బయ్యారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమీప దూరంలో ఉన్న వాటర్ పంపు లైన్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో రాత్రి సమయంలో విషపురుగులు బయటికి వస్తున్నాయని, దోమల వలన విష జ్వరాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. మురికి నీరు పైపు లైన్‌లోకి చేరి తాగు నీరు కలుషితం అవుతుందని, అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

     

  • పొలాల పండుగ ‘శుక్రవారం’

    ఆదిలాబాద్: జిల్లా పంచాంగకర్త చిక్కిలి వెంకటేశ్వర సిద్ధాంతి ఆదేశానుసారముగా పొలాల అమావాస్య పండుగను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరుపుకోవాలని కళ్యాణ్ పంతులు తెలిపారు. శనివారం పొలాల అమావాస్య ఉదయం 10.00 గంటల వరకు ఉంటుందన్నారు. బసవన్నలను ఊరేగింపుగా తీసుకెళ్లి పూజ చేసుకునేటప్పుడు అమావాస్య ఉండదు కాబట్టి శుక్రవారం రోజున పొలాల పండుగ చేసుకోవలసిందిగా తెలిపారు. రైతులు, ప్రజలందరూ దీనిని గమనించాలని సూచించారు.

  • నేషనల్ హైవేపై ఘోరం.. ఒకరి మృతి

    ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఖమ్మం వైపు వెళ్తున్న కారు కూసుమంచి మండలంలో అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

  • చరిత్రలో మొదటిసారి.. ఓ మంత్రి ఇలా..

    కుమ్రం భీం: జైనూర్ మండలం మార్లవాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిద్ర చేశారు. భద్రత నేపథ్యంలో అధికారులు వద్దని వారించినా, ససేమిరా అన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, సౌకర్యాల కల్పన కోసం అక్కడే బస చేశారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతిగృహంలో ఓ మంత్రి రాత్రి సమయంలో బస చేయడం ఇదే మొదటిసారని పలువురు చెబుతున్నారు.

  • వనదుర్గాభవానికి ప్రత్యేక పూజలు

    మెదక్: పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు బుధవారం దర్శనం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మంజీరా నది వరద ఉద్ధృతితో ఆలయ పరిసరాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.