జగిత్యాల: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఉదయం స్వామివార్లకు క్షీరాభిషేకం చేసి, పూలతో అలంకరణ చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నృసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
Author: Shivaganesh
-
‘అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి’
సంగారెడ్డి: సదాశివపేట జాతీయ రహదారిపై లారీల కారణంగా ద్విచక్రవాహనదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఈసందర్భంగా శనివారం పలువురు వాహనదారులు మాట్లాడుతూ.. అధిక లోడుతో, ఎలాంటి కవర్లు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీలతో భయాందోళన చెందుతున్నామన్నారు. లారీల నుంచి చిన్నరాళ్లు పడి ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోందని వాపోయారు. అధికారులు తక్షణమే లారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామన్నారు.
-
బంగ్లా చెరువులో మృతదేహం లభ్యం
మెదక్: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శనివారం జిల్లాలోని బంగ్లా చెరువులో చోటుచేసుకుంది. పలువురు స్థానికులు బంగ్లా చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
కాలభైరవుడికి ప్రత్యేక పూజలు
సంగారెడ్డి: సదాశివపేట మండలం అరూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ, కాలభైరవ, కుబేర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మడుపతి సంతోష్ స్వామి మాట్లాడుతూ.. కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నాలని కోరారు.
-
ప్రలోభాలకు లొంగి.. పట్టింపు లేమి
సంగారెడ్డి: జహీరాబాద్‌లో పరిశ్రమలు థర్మోకోల్, రెగ్జిన్, ఫైబర్ వంటి వ్యర్థాలను కాల్చివేస్తూ, భూగర్భ జలాల్లో కలిపేస్తూ తీవ్ర వాయు, జల కాలుష్యానికి పాల్పడుతున్నాయని స్థానికులు వాపోయారు. కాలుష్యం కారణంగా ప్రజలు, మూగజీవాలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని, పరిశ్రమల యాజమాన్యాల ప్రలోభాలకు లొంగి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
-
చోరీకి పాల్పడిన నిందితులు అరెస్టు
వరంగల్: చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈనెల 3న మండలంలోని ఏనుగల్లు రాజన్న వైన్స్ దుకాణంలో చోరీ జరిగిందని యజమాని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.20వేలు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
-
కేసు భయం.. ప్రాణం తీసింది
సంగారెడ్డి: పోలీసుకేసు భయంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయికోడ్ మండలం హుస్నాబాద్లో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డి.గరీబ్(24) ఈనెల 10న అర్ధరాత్రి మద్యంమత్తులో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయగా, ట్రాక్టర్ డ్రైవరు అశోక్ గమనించి ప్రశ్నించగా.. ఇద్దరికి గొడవ జరిగి, గరీబ్ ఇంజిన్ వైర్లను కత్తిరించాడు. పోలీసుకేసు పెడతామని చెప్పడంతో భయపడి గరీబ్ పంచాయతీభవనంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
-
దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు
మెదక్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమాధికారిణి హైమావతి తెలిపారు. చిన్నపాటి వ్యాపారాలకు సబ్సిడీ రూపంలో గ్రామీణ ప్రాంతాల వారికి బ్యాంకుసమ్మతి లేకుండా రూ.50 వేలు చొప్పున 25 యూనిట్లు, మున్సిపల్ పరిధిలో రూ.లక్ష పైబడి 80శాతం రాయితీతో మూడు యూనిట్లు కేటాయించిన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31లోగా https://tgobmms.cgg. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
-
రూ.7 లక్షలు విలువైన ఆభరణాలు చోరీ..
కరీంనగర్: బంగారు ఆభరణాల షాప్‌లో చోరీ జరిగిన ఘటన జమ్మికుంట పట్టణంలోని బ్రాండ్ కళ్యాణ్ జ్యూవెలర్స్‌లో వెలుగుచూసింది. పట్టణంలోని బ్రాండ్ కళ్యాణ్ జ్యూవెలర్స్ షట్టర్ తాళాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి సుమారుగా రూ.7 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.
-
గోదావరికి క్రమంగా పెరుగుతున్న వరద
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో క్షణక్షణం గోదావరి ప్రవాహం పెరుగుతోందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 07:00 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 40.7 అడుగుల స్థాయికి చేరుకుందని తెలిపారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.