Author: Shivaganesh

  • రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

    భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన గురువారం దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. నాచారం గ్రామానికి చెందిన జి.రాధాకృష్ణ (30) బైక్‌పై పనిమీద కొత్తగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా బుచ్చన్నగూడెం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొని అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాలవటంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ పేర్కొన్నారు.

  • పామును చంపి.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు

    మెదక్: పామును చంపిన ఒకరు నిద్రలో మృతి చెందిన ఘటన శివ్వంపేట మండలం కొట్టాల గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మద్దూరు నర్సింలు (54) తన తమ్ముడి ఇంట్లో బుధవారం రాత్రి నిద్రిస్తూ ఉండగా, కట్లపాము కాటు వేసింది. నిద్రమత్తులో ఉండడంతో ఆ విషయాన్ని గమనించకుండా, పామును కొట్టిచంపాడు. తనకి ఏమీకాలేదని భావించి నిద్రపోయిన ఆయన ఉదయం కుటుంబసభ్యులు చూసే సమయానికి ప్రాణాలు కోల్పోయాడు.

     

  • ఎండు గంజాయి సీజ్.. నిందితుడి అరెస్ట్

    సంగారెడ్డి: అక్రమంగా తరలిస్తున్న ఎండుగంజాయిని పోలీసులు సీజ్ చేసిన ఘటన మునిపల్లి మండలం కంకోల్ టోల్‌ప్లాజా వద్ద వెలుగుచూసింది. కంకోల్ టోల్‌ప్లాజా వద్ద ఎస్సై రాజేశ్‌నాయక్ ఆధ్వర్యంలో గురువారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో మహ్మద్ సమీర్ అనే వ్యక్తి  బైక్‌పై బీదర్ నుంచి తరలిస్తున్న 6.4 కిలోల ఎండు గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

  • జూదశిబిరంపై దాడి ఐదుగురి అరెస్ట్

    హన్మకొండ: జూదశిబిరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన ఘటన గురువారం కాజీపేట మండలం అయోధ్యపురం రైల్వే గేట్ పరిసరప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా జూదశిబిరం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.72,500 స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు.

  • నిర్మల జగ్గారెడ్డికి ఆహ్వానం అందజేత

    సంగారెడ్డి: సదాశివపేట గురునగర్ కాలనీలో కొలువైన శ్రీ భవాని మాత ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఈనెల 15న దుర్గామాత బోనాల పండుగ నిర్వహించనున్నారు. ఈసందర్భంగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులు TGIIC ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి  కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

     

  • ‘త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి’

    సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలోని 37, 20 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ కె.హేమావతి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడుతూ.. త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. 400 చ.అ. స్థలం లేని వారికి అనుమతిపై ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు. అనంతరం భూమి పూజలో పాల్గొని పనులను స్వయంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి’

    మెదక్: నర్సాపూర్‌లో బుధవారం కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్‌లో నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ నాయకుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. వెంటనే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

  • మంత్రి వివేక్‌ను కలిసిన నాయకులు

    సంగారెడ్డి: ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని హార్టెక్స్ రబ్బరు పరిశ్రమ యూనియన్ సంఘం గుర్తింపు ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాములు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరప్రసాద్ రెడ్డి విజయం సాధించిన విషయం విదితమే. ఈసందర్భంగా వారు బుధవారం సచివాలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. యాజమాన్యాలు కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్నారు.

  • బుర్ర యాకంబ్రంకు ఎమ్మెల్యే పరామర్శ

    హన్మకొండ: ఐనవోలు మండల పరిధిలోని రాంనగర్ గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బూర యాకాంబరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈక్రమంలో ఆయన బాలసముద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకొని బుధవారం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు బాధితుడిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • పీహెచ్‌డీ పొందిన వారిని సన్మానించిన ఎమ్మెల్యే

    హన్మకొండ: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు బుధవారం ఇటీవల పీహెచ్‌డీ పట్టాలు పొందిన డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ జగన్ మోహన్, డాక్టర్ చందు, డాక్టర్ సురేష్‌లను సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని, ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.