భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం ఉప్పుసాక, పినపాక, మొరంపల్లి బంజర గ్రామాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఆయన అంజనాపురంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు నిర్మించే బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
10 ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్
భద్రాద్రి కొత్తగూడెం: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న 10 ట్రాక్టర్లు, ఒక జేసీబీని అధికారులు సీజ్ చేశారు. పాల్వంచ మండలం రంగాపురం కిన్నెరసాని వాగు బ్రిడ్జి సమీపంలోని మామిడి తోట నుంచి అక్రమంగా మట్టి సరఫరా జరుగుతున్న సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 10 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
‘వినాయక నవరాత్రులకు అనుమతి తప్పనిసరి’
మంచిర్యాల: జైపూర్ మండలంలో వినాయక నవరాత్రులకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై శ్రీధర్ అన్నారు. నిర్వాహకులు పోలీస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, కమిటీ సభ్యుల వివరాలు పోలీసులకు తెలియజేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
-
చికిత్స పొందుతూ రైతు మృతి
జనగామ: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో పరిధిలో వెలుగుచూసింది. కంబాలకుంట తండాకు చెందిన బానోతు బీక్యా (57) తనకు ఉన్న రెండెకరాల్లో పత్తి, మిర్చి సాగు చేశాడు. పంట దెబ్బతినడంతో రూ.4 లక్షలు అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.
-
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య..
జయశంకర్ భూపాలపల్లి: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాటారం మండలం అంకుశాపూర్‌లో వెలుగచూసింది. గ్రామానికి చెందిన బొల్లి బాపు(38) పత్తి సాగు కోసం రూ.70 వేలు అప్పు చేశారు. పంట దెబ్బతినడంతో మనస్తాపం చెందిన ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
జలమయమైన ప్రభుత్వ పాఠశాల..
నిర్మల్: మంజులాపూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జలమయమైంది. ఈ పాఠశాలలో 235 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో గత మూడు రోజులుగా వర్షపు నీరు నిలిచి ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నాలు సఫలం కావడం లేదని, ఆవరణ అంతా నీటితో నిండిపోతోందని వాపోయారు.
-
ఈనెల 22న జాబ్ మేళా
మంచిర్యాల: ఈనెల 22న నస్పూర్ సిసిసి కార్నర్‌లోని నరసయ్య భవన్లో దివ్యాంగుల సంస్థ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఎస్ఎస్సీ, డిగ్రీ, డిప్లమా, వొకేషనల్ కోర్సులు చదివిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. డేటా ఎంట్రీ, డీపీఓ, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ఆటోమోటివ్ రంగాల్లో ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
ఖమ్మం: బుర్హాన్‌పురం ఉపకేంద్రం పరిధిలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మామిళ్లగూడెం ఫీడర్లో 2 నుంచి 4గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. మామిళ్లగూడెం, బుర్హాన్‌పురం, రేవతి సెంటర్, సరిత క్లినిక్, మేకలబండ పార్కు తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
సీఎం పర్యటన వాయిదా
భద్రాద్రి కొత్తగూడెం: సీఎం రేవంత్‌రెడ్డి బెండాలపాడు పర్యటన వాయిదా పడినట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను సీఎం ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో పర్యటన వాయిదా పడినట్లు వెల్లడించారు. త్వరలో పర్యటన వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
-
త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి
జయశంకర్ భూపాలపల్లి: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులలో వరద ఉధృతి పెరుగుతోంది. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. మంగళవారం త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 10.680 మీటర్లకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీలోకి 6.65 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో, బ్యారేజీలోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.