Author: Shivaganesh

  • భద్రాచలంలో ధర్నా చేసిన కార్మికులు

     

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట బుధవారం AITUC, CITU, TUCI నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పని గంటల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

  • అధికారులతో కలెక్టర్ సమావేశం

    మెదక్: కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాలు కల్పనపై చర్పించారు. 566 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మరమ్మతులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడికి గాయాలు

    ఖమ్మం: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన ఘటన కొణిజర్ల మండలంలోని తనికెళ్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన  పెరిక వెంకటేశ్వర్లు రోజులాగానే కల్లు గీసేందుకు మంగళవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారికింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

  • ఈనెల 11న స్పాట్ కౌన్సెలింగ్

    భద్రాద్రి కొత్తగూడెం: ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. 2024-25లో ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 11న చర్లలోని ఏకలవ్య విద్యాలయంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

     

  • సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు

    జయశంకర్ భూపాలపల్లి: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం సింగరేణి వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో 11 ఏరియాల్లోని 40వేలకు పైగా కార్మికులు పాల్గొన్నారు. భూపాలపల్లి సింగరేణిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు కార్మిక నాయకులు తెలిపారు. నేటి సమ్మెతో సింగరేణికి 70 కోట్ల నష్టం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.

     

  • సమ్మె వద్దు.. విధులకు రండి

    భద్రాద్రి కొత్తగూడెం: దేశవ్యాప్తంగా బుధవారం సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సింగరేణి డైరెక్టర్లు, జీఎం వారి కార్యాలయాల్లో మంగళవారం మాట్లాడారు. సింగరేణి కార్మికులు బుధవారం నాటి సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలని డైరెక్టర్లు గౌతమ్, కె. వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలె రాజు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల డిమాండ్లలో ఒక్కటి కూడా సింగరేణికి సంబంధించినది లేదన్నారు.

  • ఎట్టకేలకు కార్మికుల వేతనాలు విడుదల

    ఖమ్మం: గ్రామపంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కార్మికులు దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల వేతనంగా రూ.5.95కోట్లను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి ఖాతాలో జమ చేశారు. వీటిని రెండు రోజుల్లోగా కార్మికులకు అందించేలా జీపీల వారీగా ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

     

  • ఈనెల 19 వరకు పరీక్ష ఫీజు గడువు

    హన్మకొండ: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో రెగ్యులర్ ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈనెల 19వ తేదీ లోపు చెల్లించాలని పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న తెలిపారు. ఈనెల 23 వరకు ఆలస్య రుసుముతో చెల్లించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9989417299, 9989139136 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

  • బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చోరీ

    మెదక్: బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చోరీ జరిగిన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సంస్థలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న పూర్ణచందర్‌రెడ్డి ఈనెల 5న ఆఫీసుకు తాళం వేసి వెళ్లి తిరిగి 7వ తేదీ వచ్చి చూసేసరికి తాళం ధ్వంసం చేసి, కౌంటర్లో ఉన్న రూ. 1500 నగదు కనిపించలేదు. పూర్ణచందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం చెప్పారు.

  • అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విద్యార్థి

    మెదక్: ఓవిద్యార్థి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన చేగుంటలో చోటుచేసుకుంది. చేగుంటకు చెందిన షేక్ ఆసిఫ్ (16) తనకు ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. దానికి వారు నిరాకరించడంతో అలిగిన ఆసిఫ్ ఈనెల 4న ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి షాదుల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.