Author: Shivaganesh

  • ‘ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి’

    ఖమ్మం: కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు.

  • టీజీఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మెరిసిన కౌశిక్ గౌడ్

    మహబూబాబాద్: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీజీఐసెట్) 2025 ఫలితాలను సోమవారం ప్రకటించిన విషయం విదితమే. ఈ పరీక్షలో తొర్రూర్ పట్టణానికి చెందిన కోటగిరి కౌశిక్ గౌడ్ రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈసందర్భంగా కౌశిక్ గౌడ్‌కు పట్టణ వాసులు, కుటుంబ సభ్యులు, శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

  • అడ్మిషన్ల కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

    మహబూబాబాద్: కలెక్టరేట్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కరపత్రాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవోదయ విద్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • రెండు బంగారు పతకాలు అందుకున్న భవాని

    మహబూబాబాద్: కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన 23వ స్నాతకోత్సవంలో కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కొలిపాక భవాని రెండు బంగారు పతకాలు అందుకున్నారు. డిగ్రీ స్థాయిలో తెలుగు లిటరేచర్, ఎంఏలో తెలుగు లిటరేచర్ విభాగంలో మరొక గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె గురుకుల లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో భవానిని పలువురు స్థానికులు అభినందించారు.

  • శాంతినగర్‌లో ఫంక్షన్ హాల్‌ సీజ్

    నల్గొండ: జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఉన్న బాలాజీ ఫంక్షన్ హాల్‌ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఫంక్షన్ హాల్ నుంచి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను UGDలోకి వదులుతున్నారని పలువురు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేసి మున్సిపల్ అధికారులు ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేశారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

  • టీబీ నిర్మూలనపై డీఎంహెచ్ఓ సమావేశం

    నల్గొండ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా టీబీ నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. టీబీ నిర్మూలన కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరీక్షలు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

  • యూత్ ఫర్ సేవతో ఎన్జీ కళాశాల అవగాహన ఒప్పందం

    నల్గొండ: ఎన్జీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం, యూత్ ఫర్ సేవ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈసందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఫిజిక్స్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయోసైన్స్, సోషల్ సైన్స్ అంశాలపై పోస్టర్లు తయారు చేశారు. అనంతరం వాటిని నల్గొండలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

  • ‘రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లను తొక్కించారు’

    హన్మకొండ: సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన ఘటన మంగళవారం కేయూ జంక్షన్‌లో చోటుచేసుకుంది. హన్మకొండ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బైక్‌లకు సంబంధించిన అధిక శబ్దం చేసే సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బైక్‌లకు సైలెన్సర్లు మార్చుకుని తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • రేపు ఎనుమాముల మార్కెట్ బంద్

    వరంగల్: జిల్లా కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి గుగులోత్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్త బంద్ కారణంగా ఎనుమాముల మార్కెట్ మూసి ఉంటుందని, రైతులు గమనించాలని సూచించారు. తిరిగి 10న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు గురువారం సరుకులు తీసుకురాలని కోరారు.

  • నేడు, రేపు మార్కెట్‌కు సెలవులు

    మహబూబాబాద్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు 8, 9వ తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నాయక్ తెలిపారు. మార్కెట్ వ్యాపారి యాద లక్ష్మణ్ మృతికి సంతాపంగా మంగళవారం, సార్వత్రిక సమ్మె కారణంగా బుధవారం సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా సాగుతాయని వెల్లడించారు.