Author: Shivaganesh

  • గొడ్డలితో దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు

    మహబూబాబాద్: నర్సింహులపేట మండలం బక్కచంద్రుతండాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం తండాలో భూతగాదాల విషయంలో తలెత్తిన గొడవలో గొడ్డలితో దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. దాడిలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు దాడికి గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • శాంతాపూర్‌లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

    కామారెడ్డి: బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రూసేగం భూమయ్య పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ స్థాపన ఈదుముడి గ్రామం నుంచి మొదలైందన్నారు. ఎన్నో బలిదానాల ఫలం ఎస్సీ వర్గీకరణ అమలు అనేదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • అర్బన్ పార్క్‌కు మోక్షం ఎప్పుడు?

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలం మంబాపూర్ – నల్లవల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో 2020లో శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు అర్బన్ పార్క్ ఏర్పాటు కోసం పనులు మాత్రం ప్రారంభించలేదని స్థానికులు తెలిపారు. సోమవారం పలువురు స్థానికులు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు అర్బన్ పార్క్‌పై దృష్టి పెట్టి పనులు పూర్తిచేయాలని కోరారు.

  • రాళ్లకత్వలో గ్రామస్థుల నిరసన

    సంగారెడ్డి: జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో సోమవారం గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని అన్నారు. మున్సిపల్ పేరుతో గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు. గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నారు.

  • నేడు డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్

    వరంగల్: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిష‌ర్ సుష్మ తెలిపారు. నేడు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 7993361942 నంబర్‌కు ఏలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ చేసి తెలపాలని సూచించారు.

  • శ్రీకాంత్ రెడ్డిని కలిసిన సీపీఐ నాయకుడు

    మహబూబాబాద్: రెడ్యాల గ్రామంలో సోమవారం కాంగ్రెస్ సంవిధాన్ బచావో రాష్ట్ర కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డిని, సీపీఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన శ్రీకాంత్ రెడ్డికి సీపీఐ జిల్లా మూడవ మహాసభల మెమంటో, బ్యాగును అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • నేడు హుస్నాబాద్‌కు రానున్న మంత్రులు

    సిద్దిపేట: హుస్నాబాద్ స్టేడియాన్ని సోమవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి సందర్శించనున్నారు. ఈసందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంతానికి రానున్నమంత్రులకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

     

  • రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

    సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం నిజాంపేట్ మండలంలో వెలుగుచూసింది. గంగరబోయిన అంజమ్మ(45) నిజాంపేట్ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా అల్లాదుర్గ్ శివారులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

     

  • ఎస్సీ హాస్టల్‌లో ప్రవేశాలు

    కరీంనగర్: హుజూరాబాద్ డివిజన్‌లోని ఎస్సీ హాస్టల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ అధికారి ఎం.విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. మూడు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9399957766 నంబర్ సంప్రదించాలన్నారు.

  • నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

    వరంగల్: సీఎస్ఏటీ 2025-26 ఉచిత శిక్షణను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కేటగిరీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా సంచాలకుడు కె.జగన్మోహన్ తెలిపారు.  శిక్షణ పొందేందుకు ప్రవేశ పరీక్ష ఈనెల 13న సుబేదారి ఆర్ట్స్ కళాశా లలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్ష వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. శిక్షణ కోసం సోమవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుందని వెల్లడించారు.