నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుందని శుక్రవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 66,638 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ఔట్ ఫ్లో 15110క్యూసెక్కులు, సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 522.40 ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు, 154.4310టీఎంసీలుగా ఉందన్నారు.
Author: Shivaganesh
-
వీరభద్ర స్వామి ఆభరణాల లెక్కింపు
హన్మకొండ: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆభరణాల లెక్కింపు ప్రక్రియను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ హైదరాబాద్ జేఈవో అంజలి దేవి, వరంగల్ ఏసీ రామాల సునిత పాల్గొన్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో యూనియన్ బ్యాంకులోని దేవస్థానానికి చెందిన 67, 73, 74 లాకర్లను పగులగొట్టారు. మిశ్రమ బంగారం, వెండి ఆభరణాలు లెక్కింపు అనంతరం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
-
భూభారతి దరఖాస్తులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
నల్గొండ: త్రిపురారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన రికార్డులు, భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పీఓటీ, పేరు తప్పు, ల్యాండ్ తక్కువ ఎక్కువ దరఖాస్తులను విడివిడిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారుల, సిబ్బంది పాల్గొన్నారు.
-
మేధో సంపత్తి హక్కులపై అవగాహన సదస్సు
నల్గొండ: ఎంజీయూ సైన్స్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంచుకుని, స్వీయ పరిశధనలతో నూతన ఆవిష్కరణలు చేస్తే వాటికి పేటెంట్ తీసుకోవడం సాధ్యమేనని అన్నారు. సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
సుద్ధ ముక్కపై అల్లూరి
సూర్యాపేట: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గల నరేష్‌చారి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం అంగుళం సుద్దముక్కపై అల్లూరి ప్రతిమని చెక్కారు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యం, పప్పు గింజలు, పెన్సిల్ మొన, ఆకులపై అద్భుత కళాఖండాలు చెక్కి పలువురి మన్ననలు పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళలో మరింత రాణించి పేరు సంపాదిస్తానని చెప్పారు.
-
‘వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి’
సూర్యాపేట: అనంతగిరి బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు వీరన్న మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వానాకాలంలో సోకే అంటువ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.
-
నడిగూడెంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి
సూర్యాపేట: నడిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య అమరుడని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-
‘పీర్ల పండుగను ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించాలి’
సూర్యాపేట: తిరుమలగిరిలో జరుగుతున్న పీర్ల పండగను ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించాలని జి.ఎం.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య అన్నారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ.. పీర్ల పండుగ నిర్వాహకులకు ఖర్చు భారంగా ఉందని, ఒక సవారి ఖర్చు రూ.3వేలు నుంచి రూ.4వేలు అవుతున్నాయని అన్నారు. నిర్వాహకులకు ఆర్థికంగా అండగా నిలిచి, తెలంగాణ సంస్కృతిని కాపాడాలని కోరారు.
-
యువతి అదృశ్యంపై కేసు నమోదు
హన్మకొండ: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ముద్దుపాడుకు చెందిన బత్తుల అపర్ణ (20) ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అదృశ్యమయ్యారు. జూన్ 29న ఒంగోలు నుంచి కాజీపేటకు రైలులో వెళ్తుండగా, కాజీపేట సమీపంలో మేనత్త బండారు శాలమ్మకు అపర్ణ కనిపించకపోవడాన్ని గుర్తించారు. ఈక్రమంలో శుక్రవారం శాలమ్మ కాజీపేట జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
దొంగను పట్టుకున్న స్థానికులు
మహబూబాబాద్: దొంగతనానికి యత్నించిన వ్యక్తి స్థానికులు పట్టుకున్న ఘటన శుక్రవారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ బజారులో వెలుగుచూసింది. రైల్వే స్టేషన్ బజారులోని బ్రహ్మణపల్లి సురేష్ ఇంట్లో సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి బీరువా తెరచి దొంగతనం చేస్తున్నారు. ఈక్రమంలో ఆయనను స్థానికులు గమనించి పట్టుకున్నారు. అనంతరం వారు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.