సూర్యాపేట: కోదాడ పట్టణ ప్రాంతీయ పశు వైద్యశాలను శుక్రవారం జిల్లా పశువైద్య, పశుసంవర్థక అధికారి డాక్టర్ డి.శ్రీనివాసరావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన పశు వైద్యశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్య నివారణకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. అధికారులు పిచ్చి మొక్కలు తొలగించి, పూలు, పండ్లు అందించే మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన పరుశురాం
నల్గొండ: నల్గొండ ఎమ్మార్వోగా శుక్రవారం కొత్తపల్లి పరుశురాం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన హరిబాబు జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిప్పర్తి ఎమ్మార్వోగా పని చేస్తున్న పరుశురాం బదిలీపై వచ్చారు.
-
‘సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్యది ముఖ్యపాత్ర’
మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మండల గొల్లకురుమ నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సంఘం మండల నాయకుడు మనుబోతుల లింగన్న మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య ముఖ్యమైన పాత్ర పోషించాడని అన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన
ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని కస్తూర్భా విద్యార్థులకు శుక్రవారం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యాధికారి జ్యోతి పాల్గొని మాట్లాడుతూ.. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆడపిల్లలు నెలసరిలో తగు జాగ్రత్తలు, మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
-
సీరోలులో రోశయ్య జయంతి
మహబూబాబాద్: సీరోలు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పూర్ణచందర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ.. రోశయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీరోల్ మండల రెవెన్యూ సిబ్బంది, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
-
‘వర్సిటీ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే’
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములను ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేటాయించడాన్ని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు శరత్ చంద్ర తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేయూ పాలకమండలి అనుమతి లేకుండా భూములు కేటాయించడం వర్సిటీ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని అన్నారు.
-
ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ధర్నా
నల్గొండ: జిల్లా కేంద్రంలోని ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు శుక్రవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చేరిన దళిత విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు ఇవ్వడం లేదని, వారిని విడిగా కూర్చోబెట్టి వివక్ష చూపుతోందని అన్నారు. నిరసన కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
హన్మకొండ: కాజీపేట తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డుల గదిని పరిశీలించి, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గురించి వివరాలను ఎమ్మార్వో భావుసింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సర్వేయర్, ఆర్ఐలతో రెవెన్యూ సంబంధిత అంశాలపై మాట్లాడారు.
-
‘కాంగ్రెస్ కంటే కడియంపైనే ఎక్కువ వ్యతిరేకత’
జనగామ: వేలేరు మండలం సోడాషపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని విమర్శించారు. సొంత పార్టీ నాయకులే కడియంపై మండిపడుతున్నారని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-
అన్నదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు
జనగామ: దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినాన్ని పార్టీ మండల అధ్యక్షులు తీగల దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కటింగ్ చేసి, అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దయన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, నిత్యం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.