Author: Shivaganesh

  • వివాహిత మృతి.. కేసు నమోదు

    ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన మధిరలోని సాయినగర్‌లో గురువారం చోటుచేసుకుంది. మడుపల్లికి చెందిన పారా కిశోర్, లక్ష్మి దంపతుల కుమార్తె అంజలి (21)కి సిరిపురం గ్రామానికి చెందిన తడికమల్ల రాముతో ప్రేమ వివాహం జరిగింది. వీరు మధిరలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో  ఆమె అనుమానాస్ప‌దంగా మృతిచెంది ఉంది. ఘటనపై కేసు న‌మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • టోల్ ప్లాజా వద్ద స్థానికుల నిరసన

    జయశంకర్ భూపాలపల్లి: టోల్ ప్లాజా వద్ద స్థానికులు నిరసన తెలిపిన ఘటన గురువారం కాటారం మండలంలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది. లోకల్ వాహనదారుల నుంచి టోల్ ఫీజ్ వసూళ్లు చేస్తున్నారని మండలంలోని కార్ల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది.

  • రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

    వరంగల్‌: నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్యటించి ఆయా గ్రామాల్లో తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లోని పలు గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణానికి రూ.15.20 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

  • ‘సీహెచ్‌సీ పనులు చివరి దశలో ఉన్నాయి’

    పెద్దపల్లి: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను గురువారం జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం పనులు చివరి దశలో ఉన్నాయని, మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ అంగీకరించాలని తెలిపారు. త్వరలో ప్రారంభానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

  • ‘లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి’

    భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు పరిధిలోని సింగరేణి వర్క్ షాప్, జీఎం ఆఫీస్, ఏరియా హాస్పిటల్ సిబ్బందితో గురువారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 9న జరనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ల‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  • ముందస్తు సమ్మె నోటీసు అందజేత

    భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రవిప్రసాద్‌కు గురువారం ముందస్తుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య సమ్మె నోటీసును అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలతో 147 కోట్ల మందికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • చికిత్స పొందుతూ ఒకరి మృతి

    కరీంనగర్: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన గురువారం గంగాధర మండలంలో వెలుగుచూసింది. జూన్ 30న మండలంలోని మధురానగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన వేముల రవి తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.వంశీకృష్ణ తెలిపారు.

  • ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి

    కృష్ణా: నందివాడ మండలంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ఇంటింటి ప్రచారాన్ని బుధవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన  మండలంలోని పెదలింగాల, చినలింగాల గ్రామాల్లో పర్యటించి, ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఏడాది పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు.

     

  • సైబర్ క్రైమ్‌పై అవగాహన

    మహబూబాబాద్: కొత్తగూడ మండలం పొగళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా ఎస్సై కుశాల్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలియని లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • డాక్టర్లకు ప్రశంసా పత్రాలు అందజేసిన జీఎం

    పెద్దపల్లి: ఆర్జీ-1 ఏరియా ఆస్పత్రిలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీఎం డి.లలిత్ కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన గర్భిణి సాయిప్రియను ప్రాణాపాయం నుంచి రక్షించిన డాక్టర్లు ఇందిరా, మద్దిలేటి, వినోద్‌లకు ప్రశంసాపత్రాలు అందించారు. మానవ రూపంలో కనిపించే దేవుళ్లు వైద్యులు అని కొనియాడారు. కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.