Author: Shivaganesh

  • కార్యకర్త కుటుంబానికి ఎంపీ పరామర్శ

    జగిత్యాల: వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెరుగు నరేష్ గౌడ్ తల్లి ఇటీవల మరణించారు. బుధవారం వారి ఇంటికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ఎన్టీఆర్ నగర్‌లో ఎమ్మెల్యే పర్యటన

    పెద్దపల్లి: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బుధవారం గోదావరిఖని పరిధిలోని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగునీరు, మంచినీటి సమస్య, రోడ్లు, వీధిదీపాల సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

     

  • ‘పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం’

    ములుగు: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యాధికారి జ్యోతి అన్నారు. వెంకటాపురం మండలం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు. అనంతరం విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

    కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విదిస్తూ బుధవారం జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పు వెలువరించారు. లింగంపేట మండలానికి చెందిన అక్కరేని శ్రీకాంత్‌ 2021లో మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

     

  • ‘పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’

    నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా నియమితులైన ఉప్పాల శ్రీనివాస్, తొలిసారి బుధవారం బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్‌తో కలిసి వచ్చిన ఆయన్ను బాన్సువాడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

     

  • చికిత్స పొందుతూ ఒకరి మృతి

    జగిత్యాల: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామంలో వెలుగుచూసింది. భార్య కాపురానికి రావడం లేదన్న కారణంతో ఓ గ్రామానికి చెందిన అలకుంట రాజశేఖర్ (35) మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ‘దళితులను ఎదగనివ్వకుండా అడ్డుకున్నది ఎర్రబెల్లి’

    వరంగల్: వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దళితులను ఎదగనివ్వకుండా అడ్డుకున్నది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని విమర్శించారు. ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుకు వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

  • ‘అవినీతికి ఆస్కారం లేదు’

    జనగామ: ధర్మసాగర్ మండలానికి చెందిన 71 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు బుధవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఎల్కతుర్తి పోలీసులకు సీపీ సూచన

    వరంగల్: ఎల్కతుర్తి పోలీస్ స్టేషనను వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం సీపీ సన్‌ప్రీత్ సింగ్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పెండింగ్లో ఉన్నవి, కోర్టు పరిధిలో ఉన్న కేసులకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మార్యాదగా వ్యవహరించాలని అన్నారు.

     

  • ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి’

    హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సైబర్ జాగృతి దివస్ సందర్భంగా బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హన్మకొండ సీఐ శివకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండి, ఉన్నత చదువులు చదివి, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.