వరంగల్: రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద తమకు సరిపడా యూరియా లభించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫర్టిలైజర్ షాపులలో యూరియాతో పాటు ఇతర ఎరువులను లింకు పెట్టి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Author: Shivaganesh
-
నులిపురుగు నివారణ దినోత్సవం..
మెదక్: కౌడిపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాఫులే ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగు నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, తప్పకుండా ప్రతిఒక్కరూ నులిపురుగుల నివారణ మందులు వేసుకోవాలన్నారు. అనంతరం వారికి ఆల్ఫెండ జోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
కాగజ్ మద్దూర్‌లో అత్యధిక వర్షపాతం..
మెదక్: జిల్లా వ్యాప్తంగా ఉదయం 8:00 వరకు కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కాగజ్ మద్దూర్ 62.8 మి.మీ, దామరంచ 59.3 మి.మీ, మిన్పూర్ 46 మి.మీ, నర్సాపూర్ 503.3 మి.మీ, నాసాయిపేట 50 మి.మీ, వెల్దుర్తి 46 మి.మీ, సోంపేట 43.5 మి.మీ, నర్లాపూర్ 43.3 మి.మీ, కొల్చారం 41 మి.మీ, చెప్పులుదూతి 40.8 మి.మీ.. తదితర ప్రాంతాల్లో కురిసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
-
వరదల్లో చిక్కుకున్న నలుగురు సురక్షితం..
ములుగు: వరదల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కాపాడిన ఘటన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో వెలుగుచూసింది. పశువుల కాపరి దుబారీ రామయ్య, చేపలు పట్టడానికి వెళ్లిన పి.సాయికిరణ్, రాజబాబు, రాములు వరదల్లో చిక్కుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు.
-
యూరియా కోసం రైతుల ధర్నా..
మహబూబాబాద్: నర్సింహులపేట మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా బస్తాల కోసం ధర్నా చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురు చూస్తున్న లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయకడం లేదని వాపోయారు. వ్యవసాయ అధికారులు సర్దిచెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.
-
భయాందోళనకు గురి చేస్తున్న వానర సేన..
మెదక్: నర్సాపూర్ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీ 10వ వార్డులో కోతుల బెడద తీవ్రంగా మారిందని కాలనీవాసులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. వందలాది కోతులు రోజూ వీధుల్లోకి వచ్చి ప్రజలపై దాడులు చేస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయంతో బయటకు రాలేకపోతున్నారని అన్నారు. సమస్యపై మున్సిపాలిటీ అధికారులు వెంటనే దృష్టిసారించాలని కోరారు.
-
నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు..
మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. అమ్మవారికి నిమ్మకాయల మాలతో కుంకుమార్చన నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
-
కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
నిర్మల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ లోకి 11,893 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుందని మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కుడి, ఎడమ కాల్వకు, మిషన్ భగీరథకు 2 గేట్లను ఎత్తి మొత్తం 7,294 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 694.350 అడుగుల నీటి మట్టం ఉందన్నారు.
-
‘గణేష్ నవరాత్రులకు అనుమతి తప్పని సరి’
వరంగల్: ట్రై సిటీ పరిధిలో గణేష్ నవరాత్రులు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రిత్ సింగ్ తెలిపారు. ఆన్‌లైన్‌లో అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో మండపం వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, ప్రదేశం వంటి సమాచారంతో నమోదు చేసుకోవాలని సూచించారు. వినాయక మండపం నిర్వాహకులు తప్పని సరిగా ఈ నిబంధనలు పాటించాలన్నారు.
-
తెగిపోయిన సింగూరు ఎడమ కాల్వ
సంగారెడ్డి: సింగూరు ఎడమ కాల్వ మరోసారి తెగిపోయిన ఘటన పుల్కల్ మండలం మిన్పూర్ వద్ద వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఇసోజిపేట గ్రామ శివారులో కాల్వ తెగిపోగా, ఇప్పుడు మైసమ్మ చెరువులోకి వరద నీరు చేరడంతో తూము తెగిపోయింది. దీంతో వరద నీరు పొలాల్లోకి వెళ్లి పంటలను ముంచెత్తింది. ఈసందర్భంగా పలువురు అన్నదాతలు మాట్లాడుతూ.. ఈసమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు.