కరీంనగర్: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శుక్రవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మంత్రితో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘నషా ముక్త్ భారత్’ కమిటీ సభ్యుల సమావేశం
హన్మకొండ: కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా వారు జిల్లాలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
-
తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి
వరంగల్: తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెంగల సురేష్ గౌడ్ కులవృత్తులో భాగంగా శుక్రవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
కరీంనగర్: శంకరపట్నం మండలం కొత్తగట్టు సబ్ స్టేషన్‌లో శనివారం విద్యుత్తు మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరాఫరలో అంతరాయం ఏర్పడుతుందని శుక్రవారం ఏఈ రఘు తెలిపారు. కొత్తగట్టు, లింగాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్తు వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
-
రేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
కరీంనగర్: హుజూరాబాద్ పట్టణంలో శనివారం సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు శుక్రవారం ఏఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హుజూరాబాద్ పట్టణం, కొత్తపల్లి, బోర్నపల్లి, సింగపూర్ ఫీడర్‌లలో ఉదయం 8:30 – 10.30 వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు గమనించి విద్యుత్తు అధికారులకు సహకరించాలన్నారు.
-
సీజనల్ వ్యాధులపై అవగాహన
ములుగు: వెంకటాపురం మండల పరిధిలోని మంగవాయి గ్రామంలో శుక్రవారం డ్వాక్రా సంఘం మహిళలకు కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్యాధికారి సూర్య మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కాచి చలార్చిన నీటిని తాగాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
-
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
వరంగల్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ధర్మారం రైల్వే గేటు సమీపంలో వెలుగుచూసింది. గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఉడత బన్నీ (19) ధర్మారం రైల్వే గేట్ సమీపంలోని మైలురాయి నెంబర్ 381/24- 26 వద్ద చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
మాజీ కార్పొరేటర్‌ను అభినందించిన ప్రజలు
పెద్దపల్లి: రామగుండం ఆర్ఎఫ్సీఎల్ మెయిన్ రింగ్ రోడ్డు గుంతలు పడి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం మాజీ కార్పొరేటర్ కందుల సతీష్ స్వయంగా రహదారి గుంతలను పూడ్చే పని చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, తన సొంత ఖర్చులతో ట్రాక్టర్ల ద్వారా మట్టి సమకూర్చి గుంతలను పూడ్చినట్లు చెప్పారు. ఆయనను పలువురు అభినందించారు.
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 28 మంది అరెస్ట్
రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 28 మంది మందుబాబులు పట్టుబడ్డారు. శుక్రవారం వారిని వేములవాడ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తు వేములవాడ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెలువరించినట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
అంబులెన్స్‌లను తనిఖీ చేసిన అధికారులు
ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పోగ్రామ్ మేనేజర్ నధీర్, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి రాజ్‌కుమార్‌లు 102, 108 అంబులెన్స్ వాహనాలను తనిఖీలు చేశారు. ఈసందర్భంగా వారు వాహనాలకు సంబంధించిన రికార్డును పరిశీలించారు. అనంతరం వారు సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.