నల్గొండ: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడి రైతు మృతి చెందిన ఘటన గురువారం తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి (51) తన పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఒక్కసారిగా భూమిలో ట్రాక్టర్ దిగబడింది. దానిని తీసే క్రమంలో ట్రాక్టర్ ముందుభాగం లేచి తిరుగబడింది. ప్రమాదంలో వెంకట్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Author: Shivaganesh
-
యోగా దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన వీసీ
నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే యోగా దినోత్సవ పోస్టర్లను గురువారం వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యూనివర్సిటీలో వైభవంగా నిర్వహించాలని అన్నారు. కామర్స్ అండ్ బిజనెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ -4 ఆధ్వర్యంలో విద్యార్థులకు గతవారం రోజులుగా యోగాశిక్షణ నిర్వహించి చైతన్యం చేయడం అభినందనీయమన్నారు.
-
‘భూసమస్యలకు శాశ్వత పరిష్కారం’
యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో గురువారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే
పెద్దపల్లి: ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య చనిపోయారు. విషయం తెలుసుకొని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌తో ఆయన సతీమణి మంథని మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజలు వారి ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
‘అర్చకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలి’
జగిత్యాల: ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గురువారం సచివాలయంలో తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్ ఆధ్వర్యంలో అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు అర్చకుల సమస్యల గురించి వివరించారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
-
వేలేరులో పర్యటించిన ఎమ్మెల్యే
హన్మకొండ: వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం శాలపల్లిలో పర్యటించారు. గ్రామంలో సూమారు 79 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వారిలో 36మంది గృహ నిర్మాణాలు చేపట్టారు. పలువురు గ్రామస్థులు బిల్లులు రావడంలేదని ఎమ్మెల్యేకు చెప్పగా, బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తే సహిందేది లేదని హెచ్చరించారు.
-
కలెక్టరేట్‌లో విభాగాలను పరిశీలించిన కలెక్టర్
హన్మకొండ: కలెక్టరేట్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. కలెక్టరేట్‌లోని పరిపాలన విభాగం, డీఈ సెక్షన్, ఎలక్షన్ సెల్, మినీ కాన్ఫరెన్స్‌హాల్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, చైల్డ్‌కేర్ సెంటర్, రికార్డు రూమ్, ఎన్‌ఐసి, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ను సందర్శించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.
-
అదనపు కలెక్టర్‌ను కలిసిన అధికారులు
కరీంనగర్: కలెక్టరేట్‌లో గురువారం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు పూల మొక్కలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు అదనపు కలెక్టర్‌తో జిల్లా అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
-
నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.రెండు లక్షలు అందజేత
రాజన్న సిరిసిల్ల: బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన పీచర శ్రీహర్ష ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్‌గా పని చేస్తున్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.లక్ష అందజేశారు. వారి స్నేహితుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ కృష్ణకుమార్ కూడా రూ. లక్ష విరాళంగా పరిపాలన విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రవణ్‌కు అందజేశారు.
-
బెస్ట్ ఆవైలబుల్ పాఠశాలగా నరేంద్ర విద్యాలయం
కరీంనగర్: గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లిలోని నరేంద్ర విద్యాలయం జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ఎంపికైనట్లు గురువారం పాఠశాల యాజమాన్యం గంగాధర రాజేశం, గుజ్జుల గోపాల్ రెడ్డి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి నాన్ రెసిడెన్సియల్ పాఠశాలగా అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలో బెస్ట్ అవైలైబుల్ పాఠశాలగా ఎంపికైనందుకు ఎంఈఓ ప్రభాకర్ రావు ప్రత్యేకంగా అభినందించారు.