సంగారెడ్డి: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక పెంకుటిల్లు కూలిపోయిన ఘటన ఆందోల్ మండలం జోగిపేటలోని బాబా నగర్ కాలనీలో వెలుగుచూసింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అయ్యారు.
Author: Shivaganesh
-
జలదిగ్బంధంలో దుర్గాభవానీ ఆలయం
మెదక్: జిల్లాలోని ఏడు పాయల దుర్గాభవానీ ఆలయం ఆరు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహించి ఆలయాన్ని వరద ప్రవాహంతో ముంచెత్తింది. వరద నీరు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతోంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగిస్తున్నారు. వరద ఉద్ధృతి కారణంగా భక్తులకు ఆలయ సందర్శన నిలిపివేశారు.
-
నేడు జిల్లాలో విద్యాసంస్థలు బంద్..
ఆదిలాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు తప్పని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరం అయితేనే బయటికి రావాలని అన్నారు.
-
ఎంపీడీఓకు తప్పిన ప్రమాదం..
ములుగు: కమలాపురం లోతట్టు ప్రాంతంలో సోమవారం మంగపేట ఎంపీడీఓ భద్రునాయక్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన వరద నీటిని పరిశీలిస్తున్నప్పుడు సైడు కాలువలో జారిపడ్డారు. తోటి అధికారులు వెంటనే ఎంపీడీఓను పైకి లేపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో పర్యటించిన ఎంపీడీఓకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
-
‘పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి’
హన్మకొండ: పరకాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు విలేజ్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కొత్త, పాత అనే తేడా లేకుండా నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
-
బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలంలో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉప్పుసాక, పినపాక, అంజినాపురం, మొరంపల్లి బంజారా గ్రామాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పర్యాటనలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
-
పనులను పరిశీలించిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగుండా మండలం బెండలపాడుకు వెళ్లే దారిలో జరుగుతున్న డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
-
అత్యాచారం నిందితుడు అరెస్ట్..
ఆదిలాబాద్: ఈనెల 8న శివాజీ చౌక్ సమీపంలో యాచకురాలిపై అత్యాచారం పాల్పడిన నిందితుడు మాడవి నగేష్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకున్నా పది రోజుల్లోనే కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో, కామంతో నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా సీఐని, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
-
ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్
వరంగల్: బల్దియా సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ప్రజలు కమిషనర్ చాహత్ బాజ్పాయికి తెలిపారు. తాజాగా కాలనీల్లో రోడ్లు, లేఅవుట్ స్థలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులన్ని పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
‘ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి’
మెదక్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ నారాయణ నాయక్ సూచించారు. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సెల్ ఫోన్‌లు వాడటం మానుకోవాలని, ఇంటికి ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని, వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.