Author: Shivaganesh

  • ర్యాంప్ ప్రాజెక్టుపై అవగాహన సదస్సు

    పెద్దపల్లి:  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్‌ ప్రాజెక్టుపై ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఆర్‌డీవో కాళిందిని పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అందించే ఏకరూప దుస్తులు కుట్టెందుకు ఒక్కోమహిళా సభ్యురాలిపై రోజుకు రూ.200 ఖర్చు చేస్తూ 10 రోజులు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు.

     

     

  • మిర్యాలపెంటలో ఘోరం..

    మహబూబాబాద్: బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో సోమవారంరాత్రి శ్రీలక్ష్మి బోరు వెహికిల్ ఆధ్వర్యంలో బోరు వేశారు. రాత్రి కావడంతో అందరూ అక్కడే నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం వాహనంకింద నిద్రిస్తున్న హిడ్మా(15) అనే వర్కర్‌ను గుర్తించకుండా వాహనాన్ని ముందుకు తీయడంతో టైరు కిందపడి అతడు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసినట్లు తెలిపారు.

     

  • ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి సన్మానం

    జగిత్యాల: మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఐఐటీలో సీటు సాధించిన మండల వాసి శ్రీఖర్‌ను ఎమ్మార్వో రమేష్ గౌడ్ సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. శ్రీఖర్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో శ్రీఖర్‌ను ఎస్సై రాజు సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు శ్రీకాంత్ – శ్రావణిలు పాల్గొన్నారు.

  • పెగడపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

    జగిత్యాల: పెగడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ పాల్గొని 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

     

  • నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

    జగిత్యాల: ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్న ఘటన మంగళవారం ధర్మపురి పట్టణంలో వెలుగుచూసింది. పట్టణంలో ఉదయం బస్టాండ్ వద్ద కొత్తపల్లి కిషన్ అనే వ్యక్తికి చెందిన తులం బంగారం చైన్ మెడలోంచి తెగిపోయి నగునూరి నాగేష్ అనే ఆటో డ్రైవర్‌కు దొరికింది. చైన్‌ను గమనించిన ఆటో డ్రైవర్ నగేష్ దానిని పోలీస్ స్టేషన్‌లో  అందజేశారు. కిషన్‌ను గుర్తించి పోలీసులు చైన్‌ను అప్పగించారు.

  • శిథిలావస్థలో వ్యవసాయశాఖ భవనం

    కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయశాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుందని మంగళవారం స్థానికులు ఆందోళన చేశారు. శిథిలావస్థకు చేరిన భవనం పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో చిరుజల్లులకే వర్షం నీరు లోపలికి వచ్చి విలువైన వస్తువులు తడిచే ప్రమాదం ఉందని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని కోరారు.

  • ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే

    వరంగల్: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వలబోడు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని మంగళవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గనికి నూతన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయినట్లు పేర్కొన్నారు. స్కూల్ స్థల సేకరణ నిమిత్తం ప్రభుత్వ భూమిని పరిశీలించినట్లు తెలిపారు. పది రోజుల్లో పాఠశాలకు భూమిపూజ చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య

    వరంగల్: జీవితంపై విరక్తి చెందిన ఓ ఆటో డ్రైవర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్‌ల మధ్య వెలుగుచూసింది. నల్లబెల్లి మండలం సరస్వతినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఉడుత శివప్రసాద్(28) చదువుకు తగిన ఉద్యోగం రాలేదని జీవితంపై విరక్తి చెంది గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • గుడిసెలను సందర్శిచిన నాగజ్యోతి

    ములుగు: ఏటూరునాగారం మండలం రోహీర్ పరిధిలోని చల్పాక రహదారి వెంట నిరుపేదలు వేసుకున్న గుడిసెలను మంగళవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవి శాఖ అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని అన్నారు. నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

  • యువతిని రక్షించిన పోలీసులు

    నిర్మల్: బాసర గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన యువతిని సోమవారం పోలీసులు రక్షించారు. నిర్మల్ జిల్లా రామ్‌నగర్‌కు చెందిన బూత్కూర్ ప్రియాంక అనే వివాహిత కుటుంబ కలహాలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోడానికి వచ్చారు. ఆమెను పోలీసు పెట్రోలింగ్ బృందం కాపాడి స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.