సూర్యాపేట: కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ మాధవరపు బ్రహ్మం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తోటి ఎల్ఐసి ఏజెంట్లు, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది అంతా కలిసి శనివారం ఆయనకు రూ.1,45 లక్షలు ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు, స్నేహితులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి’
నిర్మల్: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శి మైలారపు భాస్కర్ ఇంటికి శనివారం ఎమ్మార్పీఎస్, బుడగా జంగం నాయకులు వెళ్లారు. ఈసందర్భంగా వారు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
-
ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో బాపురావు
ఆదిలాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని శనివారం మాజీ ఎంపీ సోయం బాపురావు దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ ఎంపీకి ఆలయ అర్చకులు అమ్మవారి ప్రతిమను బహుకరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
-
‘రక్తదానం ప్రాణదానంతో సమానం’
సూర్యాపేట: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్త దాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని స్వర్ణ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నీల సత్యనారాయణ అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కోదాడలోని తిరుమల హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తం అందించిన షేక్ నజీర్, ఓరుగంటి కిట్టులను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.
-
‘కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
సూర్యాపేట: కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చట్టాలను అమలు చేస్తున్నాయని, వాటి గురించి కార్మికులు అవగాహన పెంచుకొవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు.
-
కామ్రేడ్ గోపి స్మారకార్థం విజ్ఞాన కేంద్రం
యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మిక నాయకుడు కామ్రేడ్ గోపి స్మారకార్థం భువనగిరిలో ప్రజా గ్రంథాలయం, ఆడిటోరియం నిర్మించడానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. వాటి నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేశారు.
-
నీట్ పరీక్షలో మెరిసిన జిల్లా వాసి
మహబూబాబాద్: నీట్ పరీక్షలో జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి ప్రణీతం సుహాస్‌కు ఉత్తమ పత్రిభ కనబరిచారు. విద్యార్థికి పరీక్షలో 408 మార్కులు వచ్చాయి. శనివారం విద్యార్థిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డపల్లి ఉపేంద్రంలు అభినందించారు. వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
-
‘తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి’
ములుగు: ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై కొప్పుల తిరుపతిరావు శనివారం తెలిపారు. ఈనెల 15 వ తేదీ నుంచి వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కచ్చితంగా హెల్మెట్ ధరించే వాహనం నడపాలని అన్నారు. వాహన దారులు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ పేపర్లు కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.
-
‘కల్తీని అరికట్టడానికి కేంద్రం కమిషన్ వేయాలి’
ఆదిలాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ వస్తువులు, నకిలీ మందులు, అధిక ధరలకు ఆన్‌లైన్ విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీని అరికట్టడానికి కేంద్రం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
-
చెన్నూర్‌లో జాతీయ లోక్ అదాలత్
మంచిర్యాల: చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం కేసులు 1458 కేసులు రాజీ ద్వారా పరిష్కారం అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.