నిర్మల్: ఈనెల 19న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు శనివారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ తెలిపారు. ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం ఉంటుందని తెలిపారు. పర్యటనలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Author: Shivaganesh
-
విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతి
మహబూబాబాద్: విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతి చెందిన ఘటన శనివారం డోర్నకల్ మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలానికి చెందిన క్రాంతికుమార్ డోర్నకల్ మండలంలో లైన్‌మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం విద్యుత్తు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
-
‘బాధిత కుటుంబానికి అండగా ఉంటాం’
మహబూబాబాద్: మంచి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరనిలోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
రక్తదాన శిబిరం
ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్అండి అతిధిగృహం ఆవరణంలో శనివారం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయిప్రకాష్ జ్ఞాపాకార్ధం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని వెంకటాపురం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మర్వో వేణుగోపాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో వాసు, సాయితేజా, సాని, మధు, మురళి, చిడెం శివ యాలం సాయి, మాధూరి తదితరులు పాల్గొన్నారు.
-
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ
మహబూబాబాద్: నర్సింహులపేట మండలం గోప తండా గ్రామంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి, పలువురి ఇండ్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి’
యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌లోని నారాయణ విద్యాసంస్థల్లో శనివారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవుల్లో పాఠశాలలు నడుస్తున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
-
‘విద్యార్థులకు ఉచిత బస్ పాసులు కల్పించాలి’
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపోలో శనివారం సూపరిండెంట్‌ను పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెంచిన బస్సు పాస్ ల ఫీజు తగ్గించాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు కల్పించాలని ఆర్టీసీ సూపరిండెంట్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.
-
వృద్ధురాలి గొలుసు చోరీ.. ఇద్దరి అరెస్ట్
వరంగల్: వర్ధన్నపేటలో చైన్ స్నాచింగ్ కేసును శనివారం పోలీసులు ఛేదించారు. నల్లబెల్లి గ్రామానికి చెందిన పెరంబదూరు సుజాత(65) మెడలో రెండు తులాల బంగారు గొలుసును ఆమె ఆడబిడ్డ మనవరాలు రామాయణం హేమలత, ఆమె ప్రియుడు పడియాల రాము కలిసి దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నేరానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
‘హలాల్ చేసి బలివ్వడాన్ని నిషేధించాలి’
మహబూబాబాద్: కురవి మండలంలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయంలో జంతువులను హలాల్ చేసి బలివ్వడాన్ని నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ (VHP) మానుకోట శాఖ విజ్ఞప్తి చేసింది. శనివారం సంఘం సభ్యులు మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ అధికారులను కోరినట్లు తెలిపారు. దానికి వారు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
-
‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’
నిర్మల్: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొని న్యాయ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె, జ్యూడిషియల్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ… న్యాయం కోసం కోర్టుల వద్ద వేచి చూసే అవసరం లేకుండా లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.