Author: Shivaganesh

  • ఉచిత కంటి వైద్య శిబిరం

    మహబూబాబాద్: లక్ష్మీపురం గ్రామంలో శనివారం సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాంకుడోత్ నవీన్ నాయక్ పాల్గొని శిబారాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. 50 మందికి పరీక్షలు నిర్వహించి, వారిలో 12 మందిని ఆటోలో కంటి శాస్త్ర చికిత్స కోసం సూర్య హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.

  • ఖాళీ బిందెలతో మహిళల నిరసన

    నిర్మల్: కుభీర్ మండలం నిగ్వ గ్రామంలో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసందర్భంగా శనివారం పలువురు మహిళలు ఖాళీ నీటి బిందెలతో గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామంలో బోరు మోటార్లు పని చేయక నీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని కోరారు.

  • తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి

    జయశంకర్ భూపాల‌ప‌ల్లి: తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రాములు శుక్రవారం రాత్రి తాడిచెట్టు ఎక్కి కిందికి దిగే క్రమంలో మోకు జారి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

  • ‘నేతన్న భరోసాను అమలు చేయాలి’

    యాదాద్రి భువనగిరి: మోత్కూర్ మండలం పాలడుగులో శనివారం చేనేత కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన నేతన్న భరోసాను వెంటనే అమలు చేసి, అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికునికి పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • సింగరేణి ఆసుపత్రిని తనిఖీ చేసిన జీఎం

    పెద్దపల్లి: గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిని శుక్రవారం ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్పిటల్‌లో మందుల స్టోరేజ్‌ పరిస్థితి, పేషెంట్‌‌లకు అందిస్తున్న మందుల వివరాలను ఫార్మసి కౌంటర్‌ వద్ద ఉద్యోగులను, కార్మికులు, అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు, వారి కుటుంబాలకు మంచి వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • మాజీ ఎంపీటీసీకి నాయకుల నివాళి

    కరీంనగర్: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా వారు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ చాడ శోభ నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి వారి కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.

  • భట్పల్లిలో అక్షరాభ్యసం..

    కొమురం భీమ్: కాగజ్‌నగర్ మండలం భట్పల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎంఈఓ మాసాల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు పలువురు విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించి, నోటు పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణీ చేశారు.

  • సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి

    కరీంనగర్: జూబ్లీహిల్స్‌లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, తోట లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన రెజింతల సావిత్రి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం ఆమెకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్ఓసీ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • అమ్మమాట అంగన్‌వాడీ బాట

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్‌వాడీ సెంటర్లను ముగ్గులు, తోరణాలతో అలంకరించారు. అనంతరం అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికి తిరిగి చిన్నపిల్లల తల్లిదండ్రులకు బొట్టుపెట్టి కేంద్రాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.