Author: Shivaganesh

  • ఈనెల 23న భద్రాచలంలో జాబ్ మేళా

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని నిరుద్యోగులైన గిరిజన యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భద్రాచలం వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) లో శనివారం ఉదయం 9 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా కెమికల్, బీటెక్ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.

  • ఏజెన్సీ వాసులకు కాస్త ఉపశమనం..

    ములుగు: ఏజెన్సీలో సోమవారం భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగపేటలో 19 సెం.మీ, ఏటూరునాగారంలో 16 సెం.మీ, వెంకటాపురంలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. దీంతో పలు కాలనీలు నీట మునగడంతో ముంపు బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. సోమవారం సాయంత్రం నుంచి వర్షం తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జీడివాగు, ఎర్రవాగుల ఉధృతి ప్రస్తుతం కొంత మేరకు తగ్గింది.

  • దరఖాస్తుల ఆహ్వానం

    మెదక్: నిజాంపేట కస్తూర్బా పాఠశాలలో ఆంగ్ల అతిథి ఉపాధ్యాయురాలి పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారిణి రాణి తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో బీఎడ్‌తో పాటు టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వాళ్లు ఈనెల 20లోగా రామాయంపేట పరిధి కోమటిపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

     

  • ఈనెల 20న ఉద్యోగ మేళా

    వరంగల్: ఈనెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి టి.రజిత తెలిపారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ప్రతమ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తరగతి నుంచి డిగ్రీ పాస్/ ఫెయిల్ అయిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు నెంబరు 70931 68464లో సంప్రదించాలన్నారు.

  • ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

    కుమ్రం భీం: కాగజ్‌నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరంలో 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. సెప్టెంబరు 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 2026 ఫిబ్రవరి 7వ తేదీన అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు.

     

  • ప్రాణం తీసిన వాటర్ హీటర్…

    ఖమ్మం: కరెంట్ షాక్‌తో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో చోటుచేసుకుంది.  దేవరకొండ వెంకటఅనిల్‌కుమార్(41) తెల్లవారుజామునే స్నానం చేసేందుకు బకెట్లో వాటర్ హీటర్ పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి ఆయన మరణించి ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు.

     

  • హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..

    కుమ్రం భీం: సిర్పూర్ (టి) నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి. హుడ్కిలి, వెంకట్రావు పెట్, పోడ్సా అంతరాష్ట్ర బ్రిడ్జ్, పెనుగంగ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దప్పు చాటింపు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మార్వో రహీముద్దీన్ మాట్లాడుతూ.. జాలర్లు, ప్రజలు నది ప్రాంతంలోకి వెళ్లకూడదని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

  • ప్రమాదకరంగా పాఠశాల భవనం..

    నిర్మల్: భైంసా మండలంలోని హంపోలిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. ఈసందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాలకు భవనం కూలేస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కుభీర్ మండలం సోనారిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల బిల్డింగ్ కూలిపోయి ఓవిద్యార్థికి గాయాలైన విషయం తెలిసిందే. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • ‘బహుజన పోరాట యోధుడు పాపన్న గౌడ్’

    వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు. స్థానిక కంఠమహేశ్వర ఆలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎస్సై చందర్, గౌడ సంఘం అధ్యక్షుడు సమ్మెట  సురేందర్ పూలమాలలు వేసి నివాలర్పించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని కూల్చి బహుజన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..

    జనగామ: దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై సృజన్ కుమార్ మాట్లాడుతూ..  5 లీటర్ల గుడుంబా, 250 లీటర్ల పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.