రాజన్న సిరిసిల్ల: టిప్పర్ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రుద్రంగి మండలం మానాలఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. మానాల వైపు నుంచి రుద్రంగికి కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ సీమర్ల వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Author: Shivaganesh
-
ఆస్తి తగాదాలతో పెద్దనాన్న హత్య: యువకుడి అరెస్ట్
సంగారెడ్డి: సొంత పెద్దనాన్న మృతికి కారణమైన వ్యక్తిని బుధవారం సీఐ స్వామిగౌడ్ అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు మండలం ఘన్‌పూర్‌కు చెందిన చెర్ల రాములు (55)తో ఈనెల 5న అతని తమ్ముడి కుమారుడు దిలీప్ ఇంటి విషయమై గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి బాధితుడు మృతిచెందాడు. పరారీలో ఉన్న దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
‘కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం’
పెద్దపల్లి: రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కార్మికుల సంక్షేమానికి బీమా మేళాను నిర్వహించారు. ఎన్టీపీసీ కాకతీయ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.అరుణశ్రీ పాల్గొని మాట్లాడుతూ.. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్ర బీమా పథకాలు సురక్షబీమా, జీవన జ్యోతి, అటల్ పెన్షన్ యోజనపై కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
-
అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం
సిద్దిపేట: అక్కన్నపేట మండలం రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సెంటర్లను ముగ్గులు, తోరణాలతో అలంకరించి, ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి తల్లులను ఆహ్వానించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఎం.సుజాత, అంగన్‌వాడీ టీచర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
-
‘కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు’
సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం 11 ఏండ్ల పాలనపై బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థికస్థితిని 12వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.
-
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు’
సంగారెడ్డి: కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం కమిషన్ ముందు హాజరవుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా పార్టీ సీనియర్ నాయకులు నామ రవి కిరణ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధారంగా మారింది అన్నారు.
-
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌వో
పెద్దపల్లి: పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం శిశువులకు రోటాసిల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోటాసిల్ వ్యాక్సిన్‌ను 6 వారాల వయస్సు గల శిశువుకు ఓపీవీ, పెంటా వాలెంట్ మొదటి డోసుతో పాటు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
-
ఎంపీఓకు జీపీ ట్రాక్టర్ల తాళాలు అందజేత
జగిత్యాల: మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్యదర్శులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీఓ జగదీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు జీపీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు వస్తున్న జీతాలతో ప్రతి నెల గ్రామాల్లో సానిటేషన్, ఎలక్ట్రికల్ పనులతో పాటు జీపీ ట్రాక్టర్ల నిర్వహణకు ఖర్చు పెడుతున్నామని వాపోయారు.
-
‘గిరిజన గ్రామాలో స్పెషల్ క్యాంపు నిర్వహించాలి’
పెద్దపల్లి: కలెక్టరేట్‌లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఈనెల 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.
-
అయ్యప్పస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి
జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని బుధవారం మంత్రి హోదాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు బినాతి అశోక్ మంత్రిని సత్కరించారు. అర్చకులు తీర్థ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, తదితరులు పాల్గొన్నారు.