Author: Shivaganesh

  • ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం

    వరంగల్: నర్సంపేట పట్టణంలోని రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వరంగల్ ఆధ్వర్యంలో బుధవారం ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద పాల్గొని సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సేకరణ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఉమారాణి, ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

  • ‘భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

    పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ, సింగరేణి ఆసుపత్రులను బుధవారం ఏసీపీ ఎం.రమేష్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రుల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల అపహరణలు, వైద్య సిబ్బందిపై దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

  • బాధిత కుటుంబాలను ఆదుకున్న మంత్రి పొన్నం

    సిద్దిపేట: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముగించుకుని వెళ్తున్న వాహనం ఢీకొని కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన తాడేం సారయ్య, బండోజు గణేష్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

     

  • అభ్యంతరాలు తెలుసుకున్న షాహీద్ మసూద్

    పెద్దపల్లి: రామగుండం నగర పాలక సంస్థలో వార్డుల పునర్వ్యవస్థీకరణను బుధవారం పురపాలక ప్రాంతీయ సంచాలకుడు షాహీద్ మసూద్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామితో సమావేశమై సూచనలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. అనంతరం మూడవ డివిజన్‌లో వంద రోజుల ప్రణాళిక పనుల నిర్వాహణను పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలి’

    హన్మకొండ: పరకాల పట్టణంలో బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • గుమ్మడిదలలో సాగు పద్ధతులపై శిక్షణ

    సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ రైతు వేదికలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కూరగాయల సాగు పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చీడపీడల నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వర రావు, రైతులు పాల్గొన్నారు.

  • టిప్పర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

    రాజన్న సిరిసిల్ల: టిప్పర్ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రుద్రంగి మండలం మానాలఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. మానాల వైపు నుంచి రుద్రంగికి కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ సీమర్ల వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • ఆస్తి తగాదాలతో పెద్దనాన్న హత్య: యువకుడి అరెస్ట్

    సంగారెడ్డి: సొంత పెద్దనాన్న మృతికి కారణమైన వ్యక్తిని బుధవారం సీఐ స్వామిగౌడ్ అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు మండలం ఘన్‌పూర్‌కు చెందిన చెర్ల రాములు (55)తో ఈనెల 5న అతని తమ్ముడి కుమారుడు దిలీప్ ఇంటి విషయమై గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి బాధితుడు మృతిచెందాడు. పరారీలో ఉన్న దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

     

  • ‘కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం’

    పెద్దపల్లి: రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కార్మికుల సంక్షేమానికి బీమా మేళాను నిర్వహించారు. ఎన్టీపీసీ కాకతీయ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.అరుణశ్రీ పాల్గొని మాట్లాడుతూ.. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్ర బీమా పథకాలు సురక్షబీమా, జీవన జ్యోతి, అటల్ పెన్షన్ యోజనపై కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

  • అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సెంటర్లను ముగ్గులు, తోరణాలతో అలంకరించి, ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి తల్లులను ఆహ్వానించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఎం.సుజాత, అంగన్‌వాడీ టీచర్, గ్రామస్థులు పాల్గొన్నారు.