Author: Shivaganesh

  • జిల్లాలో అత్యధిక వర్షపాతం ఎక్కడంటే..

    మెదక్: జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేరుకుంది. అత్యధికంగా శివంపేటలో 128 మిల్లీమీటర్లు, నర్సాపూర్ లో 108.8 మి.మీ, కాగజ్ మద్దూరులో 98 మి.మీ, పెద్ద శంకరంపేట లో 89 మి.మీ, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

     

  • నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

    మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణమాసం చివరి ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు శివప్ప వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు నిర్వహించినట్లు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈవో రంగారావు, సిబ్బంది పర్యవేక్షించారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

  • అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సురేఖ

    వరంగల్: ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

     

     

  • రాకపోకలపై నిషేధం.. ఎందుకంటే

    మంచిర్యాల: భారీ వర్షాల కారణంగా చెన్నూరు మండలం అక్కపెల్లి-శివలింగాపూర్ రహదారి దెబ్బతినడంతో, రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రయాణాలను నిలిపివేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ఎంపీడీవో మోహన్, సీఐ దేవేందర్ కోరారు. ప్రజల రాకపోకలను నియంత్రించడానికి పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.

  • వరద ఉధృతిలో నలుగురు యువకులు..

    మంచిర్యాల: జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో బుగ్గ చెరువు వాగులో సరదాగా చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు వరద ఉధృతి పెరగడంతో చిక్కుకుపోయారు. వారి కేకలతో వెంటనే స్పందించిన స్థానికులు నలుగురు యువకులు కాపాడారు. సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

  • ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

    ఖమ్మం: మున్నేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలో త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ బాబు, తహసీల్దార్ సైదులు, మున్సిపల్ అధికారులు పర్యటించారు. బొక్కలగడ్డ, ఆటోనగర్, వెంకటేశ్వరనగర్, తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వారు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • సింగూరు ఎడమ కాల్వకు గండి..

    సంగారెడ్డి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామ శివారులో సింగూరు ఎడమ కాల్వకు గండి పడింది. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కాల్వ నీరు వృథాగా పోతూ, పొలాల్లోకి ప్రవహించి పంటలను ముంచెత్తిందని వాపోయారు. గత ఏడాది కూడా కాల్వకు గండి పడిందని గుర్తు చేశారు. అధికారులు తక్షణమే శ్వాశత మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.

     

  • వాగును పరిశీలించిన కలెక్టర్..

    జయశంకర్ భూపాలపల్లి: మొరంచపల్లి వాగును కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఆదివారం జిల్లాకు రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు 90306 32608ను సంప్రదించాలని సూచించారు. అత్యవరసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దని, అధికారులకు సహకరించాలని ప్రజలను కోరారు.

     

  • ఈనెల 20 నుంచి క్రీడా పోటీలు

    సంగారెడ్డి: ఈనెల 20వ తేదీ నుంచి మండల స్థాయిలో పది రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉంటాయని, పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పీడీ, పీఈటీలకు సూచించారు. క్రీడా రంగంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

  • వివాహిత మృతి.. ఒంటరైన పిల్లలు

    భద్రాద్రి కొత్తగూడెం: చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మల్లారం గ్రామానికి చెందిన సమ్మక్క (35) అనే వివాహిత ఈనెల 14న పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది.  ఐదేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందడంతో నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. తల్లీదండ్రి మృతితో పిల్లలు ఒంటరయ్యారు.