Author: Shivaganesh

  • ‘ప్రజల ప్రాణాలు పోతేనే స్పందిస్తుందా’

    జనగామ: కలెక్టరేట్ వద్ద బ్రిడ్జి నిర్మాణ సాధన సమితి చేపట్టిన నిరాహార దీక్షలకు కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు పరశురాం సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గానుగుపహాడ్, చిటకోడూర్ బ్రిడ్జిల వద్ద జరుగుతున్న ప్రమాదాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజల ప్రాణాలు పోతేనే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.

  • బావిలో మృతదేహం లభ్యం.. కేసు నమోదు

    మహబూబాబాద్: బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుధగాని కొండయ్య (48) పొలం పనులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కూతురు ఫోన్ చేసింది. స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు.

  • జోరు వానతో కుప్పకూలిన ఇల్లు..

    కుమ్రం భీం: భారీ వర్షాల కారణంగా ఇల్లు కుప్పకూలిపోయిన ఘటన బెజ్జూర్ మండలం ఏటిగూడ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన  పంబాల సన్నాసి అనే పేదవాడి ఇల్లు భారీ వర్షాలతో కుప్పకూలింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వర్షాల కారణంగా గోడలు జారిపోయి ఇల్లు కూలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కన్నీటిపర్యంతం అయ్యారు.

  • పోచమ్మతల్లి ఆలయంలో చోరీ

    హన్మకొండ: పోచమ్మతల్లి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన శనివారం మడికొండలో వెలుగుచూసింది. ఉదయం ఆలయాన్ని తెరవడానికి వచ్చిన నిర్వాహకులు గుడి తాళం ధ్వంసం చేసి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగులు చోరీ చేసినవి ఏమిటో స్పష్టత రాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

     

  • పేకాటరాయుళ్లు అరెస్టు..

    వరంగల్: ధర్మసాగర్ మండలంలోని మల్లకపల్లి శివారులో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ముగ్గురు పారిపోయారు. అయిగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 11,170 నగదు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

  • ‘తాగునీటిని జాగ్రత్తగా వాడుకోవాలి’

    మెదక్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తాగునీటిని జాగ్రత్తగా వాడాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం సూచించారు. మిషన్ భగీరథ నీరు శుద్ధి చేసినదే అయినప్పటికీ, ఆరోగ్య రీత్యా నీటిని వేడి చేసి తాగడం మంచిదని తెలిపారు. ఈ చిన్న జాగ్రత్తతో నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ సురక్షితంగా ఉండాలని సూచించారు.

  • వరద ఎఫెక్ట్.. 4 రోజు కూడా గుడి మూసివేత..

    మెదక్: ఎగువన సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం మంజీరా నది వరద ఉధృతికి గురైంది. ఆలయం గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతోంది. దీంతో నాలుగు రోజులుగా ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాలకు పూజలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావం తగ్గే వరకు ఆలయానికి భక్తులు రావద్దని అధికారులు సూచించారు.

     

     

  • ఇదేం కోపం.. పాపం వేలు కోరికేశావ్‌గా..!

    భద్రాద్రి కొత్తగూడెం: పాతఘర్షణను దృష్టిలో పెట్టుకొని చేతివేలను కొరికేసిన ఘటన శనివారం కొమరారం గుడితండాలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మునిగళ్ల రాజేశ్ స్థానిక చికెన్‌షాపులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దరావత్ శ్రీను తన యజమానితో ఘర్షణ పడగా రాజేశ్‌ నిలువరించారు. శ్రీను, రాజేశ్ మీద దాడిచేసి కుడిచేతి చిటికన వేలును కొరికేయడంతో సగం తెగిపోయింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేశారు.

  • తండ్రిని నరికి చంపిన కొడుకు..

    ఖమ్మం: తండ్రిని గొడ్డలితో కొడుకు నరికి చంపిన ఘటన మంగళగూడెంలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బండారు నాగయ్య కుమారుడు సతీష్ (22) బైక్ కొనివ్వలేదన్న కోపంతో తండ్రిని గొడ్డలితో నరికాడు. సతీష్ కొంతకాలంగా బైక్‌కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తల్లి నాగలక్ష్మి అడ్డుపడటంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చేసరికి సతీష్ పారిపోయాడు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

     

  • సైబర్ వలకు చిరు వ్యాపారి.. పాపం

    వరంగల్: సైబర్ వలకు చిరువ్యాపారి చిక్కి రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరానికి చెందిన చిరువ్యాపారి ఫేస్‌బుక్ ఖాతాకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి, ఈనెల 2వ తేదీ నుంచి విడతల వారీగా రూ. 4 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపించాడు. తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో  శనివారం మట్టెవాడ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.