Author: Shivaganesh

  • బొంతపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

    సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపాలిటీలోని బొంతపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్లు సద్ది విజయభాస్కర్ రెడ్డి, సురభి నాగేందర్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ.. గోవుల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

  • శివంపేటలో అత్యధిక వర్షపాతం..

    మెదక్: జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ ప్రకారం అత్యధికంగా శివంపేటలో 128 మి.మీ., నర్సాపూర్‌లో 108.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగజ్ మద్దూరులో 98 మి.మీ., పెద్ద శంకరంపేటలో 89 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్పా బయటికి రావద్దని ప్రజలకు సూచించారు.

  • నర్సాపూర్‌లో విఠల్ రెడ్డి జయంతి వేడుకలు

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసినిరెడ్డి, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రజల మధ్య ఉండి గురువుగా తమను ముందుకు నడిపించిన వ్యక్తి విఠల్ రెడ్డి అని కొనియాడారు.

     

  • రెండు కార్లు ఢీ.. పలువురు గాయాలు

    సంగారెడ్డి: రెండు కార్లు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన శనివారం సంగారెడ్డిలో చోటుచేసుకుంది. జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి సంగారెడ్డి ఎక్స్‌రోడ్ వద్ద ఢీకొన్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  • ‘జంటనగరాల అభివృద్ధికి ఆద్యుడు కృష్ణస్వామి’

    సంగారెడ్డి: కొరవి కృష్ణస్వామి జయంతి పురస్కరించుకొని చిట్కుల్‌లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయం శనివారం ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగర తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జంటనగరాల అభివృద్ధికి ఆధ్యుడని కొనియాడారు. కృష్ణస్వామి పోరాటస్ఫూర్తితో బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

  • గుడిహత్నూర్‌ను ముంచెత్తిన వాన..

    ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లల్లోకి వరద నీరు చేరి నిత్యవసర వస్తువులు తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని బాధితులు కోరారు.

  • కల్దుర్కిలో వాజ్‌పేయి వర్ధంతి..

    నిజామాబాద్: బోధన్ మండలం, కల్దుర్కి గ్రామంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతిని బీజేపీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన  సేవలను కొనియాడారు. నదుల అనుసంధానం, ఇతర విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జంగం వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

     

  • అలుగు పారుతోన్న పెద్దచెరువు..

    కామారెడ్డి: భారీ వర్షాలు కారణంగా జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి పెద్ద చెరువు నుంచి అలుగు పొంగుతుండగా, కామారెడ్డి-రామారెడ్డి రహదారిపై గంగమ్మ వాగు పొంగడంతో ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. రామారెడ్డిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని చెరువులు నీటితో నిండిపోయాయి.

     

  • టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత

    ఖమ్మం 5వ డివిజన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోయ శ్రీనివాసరావు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. శ్రీనివాసరావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

     

  • నో ఎంట్రీ.. ఎందుకంటే..

    మహబూబాబాద్: గూడూరు మండలంలోని సీతానగరం అటవీ ప్రాంతం కొమ్ములాంచ శివారులోని భీముని పాదం జలపాతాన్ని వీక్షించడానికి పర్యటకులకు అనుమతులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి భారీగా జలపాతానికి వరద వచ్చినట్లు తెలిపారు. వరద పెరగడంతో పర్యటకులకు జలపాతాన్ని సందర్శించడానికి ఎలాంటి అనుమతి లేదని అటవి శాఖ, పోలీస్ అధికారులు పేర్కొన్నారు.