Author: Shivaganesh

  • జోరు వాన.. బొగ్గు ఉత్పత్తి బంద్..

    భద్రాద్రికొత్తగూడెం: ఇల్లెందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా రాత్రి షిఫ్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  ఇప్పటి వరకు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది. 30 వేల క్యూబిక్ మీటర్ల(ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత పనులు పూర్తిలకు వర్షం ఆటంకం కలిగించిందని అధికారులు తెలిపారు. వర్షం అంతరాయం తొలగిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

     

  • వైరా రిజర్వాయర్‌కు భారీగా వరద..

    ఖమ్మం: భారీ వర్షాల కారణంగా వైరా రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తుంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 20 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరా రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీగలబంజర దగ్గర పగిడేరు వాగు పొంగిన పొర్లుతుంది. వాగు ఉధృతి కారణంగా పల్లిపాడు ఏన్కూర్‌ మార్గంలో రాకపోకలు బంద్  నిలిచిపోయాయి.

  • అలుగు పారుతున్న రాయరావు చెరువు

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాయరావు చెరువు నిండి అలుగు పారుతుంది. మత్తడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు వెళ్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు, పోలీసు అధికారులు చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

  • ప్రసన్నాంజనేయుడికి ప్రత్యేక పూజలు

    మెదక్: నర్సాపూర్ బస్టాండ్‌ సమీపంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ పురోహితుడు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. నవగ్రహ పూజ, గణపతి పూజ, శివ అభిషేకం చేసి, స్వామివారికి సింధూర లేపనం, సామూహిక హనుమాన్ చాలీసా, కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • పాకాల వాగు ఉగ్రరూపం.. నిలిచిన రాకపోకలు

    మహబూబాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గూడూరు మండలం కేంద్రాల్లోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతి కారణంగా గూడూరు నుంచి కేసముద్రం, గూడూరు నుంచి నెక్కొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రెవెన్యూ అధికారులు పాకాల వాగు ఉధృతిని పరిశీలించారు. చేపల వేటకు చెరువులోకి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.

  • చిరుత పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

    కుమ్రంభీం: కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇటీవల గ్రామంలోని ఒక దూడపై దాడి చేసి చిరుత పులి చంపింది. చిరుత మళ్లీ వస్తుందేమోనన్న భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని చిరుతపులిని పట్టుకునేందుకు డబ్బు చాటింపు వేయించి, స్థానికులను అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపర్లు వెళ్లవద్దని సూచించారు.

  • పోటీలను ప్రారంభించిన ఏఎస్పీ

    నిర్మల్: భైంసా పట్టణం కిసాన్ గల్లీ శ్రీ సరస్వతీ శిశు మందిర్, శాస్త్రినగర్ రాంలీలా మైదానంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని హిందూవాహిని ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీలకు ముఖ్య అతిథిగా భైంసా ASP అవినాష్ కుమార్ హాజరై పోటీలను ప్రారంభించారు. 30కి పైగా జట్టులు ఈ పోటీల్లో తలపడ్డాయి. గెలుపోందిన విజేతలకు బహుమతులు అందజేసినట్లు పట్టణ అధ్యక్షుడు వినాయక్ తెలిపారు.

  • కళాఖండాలను ప్రారంభించిన మంత్రి

    ములుగు: జిల్లా పర్యాటక రంగానికి కొత్తశోభసంతరించుకుంది. పర్యాటకులను ఆకర్షించేలా జిల్లాలోని 11 కూడళ్లలో రూ.7.14కోట్లతో రామప్ప చరిత్ర ప్రతిబింబించేలా కళాఖండాలను ఏర్పాటు చేశారు. జంగాపల్లి క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కళాఖండాలను శుక్రవారం మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్‌తో కలిసి ప్రారంభించారు. జంగాలపల్లి, ఇంచర్ల క్రాస్ రోడ్ కూడలిలో ఏర్పాటు చేసిన కళాఖండాలు పర్యాటకుల మనసు దోచేలా ఉన్నాయి.

  • ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య..

    సిద్దిపేట: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో చోటుచేసుకుంది. చేబర్తి గ్రామానికి చెందిన రామిండ్ల రాధిక (35), రాజు దంపతులకు పదేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాధిక ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి  తెలిపారు.

     

  • ‘విపత్తులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ సిద్ధం’

    మెదక్: మెదక్‌లో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. విపత్తు నిర్వహణ కోసం అవసరమైన వాహనాలు, మెడికల్ కిట్‌లు వంటి ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జి.వేణు, అధికారులు పాల్గొన్నారు.