వరంగల్: పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వంజరుపల్లికి చెందిన విజయ-రామారావు (45) దంపతులకు 25 ఏళ్ల కిందట వివాహమైంది. రామారావు పిల్లలు పుట్టడం లేదని మనోవేదనతో మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఆయన మద్యంమత్తులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Author: Shivaganesh
-
21న వరంగల్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు..
వరంగల్: వరంగల్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భాగంగా నామపత్రాల ఉపసంహరణ అనంతరం బరిలో నిలుస్తున్న అభ్యర్థుల జాబితాను సహకార శాఖ ఎన్నికల అధికారి వాల్యానాయక్ గురువారం ప్రకటించారు. ఈనెల 21న వరంగల్ ఏవీవీ కళాశాలలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బరిలో నిలవబోతున్న వారిలో ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ప్రత్యర్థి వర్గం నుంచి కోరెచంద్రమౌళి సహా 25 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
-
18 నుంచి రెండో విడత శిక్షణ..
ఆదిలాబాద్: రెండో విడత లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 18 నుంచి అక్టోబర్ 22 వరకు 50 రోజుల పాటు 130 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు భూ కొలతల సహాయ సంచాలకులు యం.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులందరూ ధ్రువీకరణపత్రాలతో పాటు జీరాక్స్ సెట్‌తో టీటీడీసీకి 18వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
-
17న జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
ఖమ్మం: ఈ నెల 17న ఖమ్మం స్టేడి యంలో బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేజెళ్ల సురేష్, బొంతు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో ఎంపిక చేసిన జట్లను ఈనెల 23 నుంచి ఆదిలాబాద్ గోటేటిలో నిర్వహించే 71వ రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని కార్యదర్శి తెలిపారు.
-
అలర్ట్.. ఒక్క రోజే ఏడు డెంగీ కేసులు
ఖమ్మం: జిల్లాలో గురువారం ఒక్కరోజే ఏడు డెంగీ కేసులు నమోదయ్యాయి. మంచుకొండ పీహెచ్‌సీ పరిధిలోని యూపీహెచ్ కాలనీ, ఖమ్మం వెంకటేశ్వరనగర్ యూపీహెచ్‌సీ శ్రీనగర్ కాలనీ, మొదుళ్లగూడెం, బోనకల్లు పీహెచ్‌సీ రావినూతల, కల్లూరు, సత్తుపల్లి మండలం గంగారం పీహెచ్‌సీ యాతాలకుంట, ఏన్కూరు పీహెచ్‌సీ పైనంపల్లిలో ఒకటి చొప్పున మొత్తం ఏడు డెంగీ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేసుల సంఖ్య 61కి చేరుకుంది.
-
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం..
సంగారెడ్డి: జహీరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ హయాంలో అర్హులైన వందమందికి పైగా లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించడంపై ఎమ్మెల్యే మాణిక్‌రావు అభ్యంతరం తెలిపారు. తన అనుచరులను అనుమతించకపోతే తాను కార్యక్రమానికి హాజరుకాబోనని భీష్మించుకోవడంతో పోలీసులు అనుమతించారు. లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ఇళ్లు అందజేస్తామని ఎంపీ సురేష్ షెట్కార్ హామీ ఇచ్చారు.
-
నలుగురు విద్యార్థులకు కరెంట్ షాక్..
జయశంకర్ భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరెంట్ షాక్ కొట్టిన ఘటన గురువారం మహాదేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్థులకు కరెంట్ షాక్‌కు తగిలింది. నవనీత్, శ్రీరామ్, రాంచరణ్, నవీన్‌లకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
-
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు
మహబాబూబాద్: బయ్యారం మండలం జగ్గుతండా గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పర్యటించారు. ఈసందర్భంగా ఆమె సమక్షంలో సుమారుగా 50 కుటంబాలకు పైగా వివిధ పార్టీ నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. ఎక్కడంటే..!
నిర్మల్: తానూర్ మండలం బోసిలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనపై గ్రామస్థులు, రజక సంఘం, బీసీ సంఘాల నాయకులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.
-
సమస్యల వలయంలో పోస్టుమార్టం గది..
వరంగల్: వర్ధన్నపేట పట్టణంలోని స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన పోస్టుమార్టం గది వద్ద కనీస సౌకర్యాలు లేవని ప్రజలు వాపోయారు. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. పోస్టుమార్టం గది చుట్టూ బురద పేరుకుపోయి ఉందని, విద్యుత్ వైర్లు నేలపై తేలియాడుతూ ప్రమాదకరంగా మారాయని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన బాటపడతామన్నారు.