భద్రాద్రి కొత్తగూడెం: కొబ్బరి చెట్టుకు రెండు తలకాయాలు ఉన్నాయి. ఇది నిజమే.. అశ్వారావుపేట పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమం పాఠశాల వద్ద రెండు తలల కొబ్బరి చెట్టు చూపరులను ఆకర్షిస్తోంది. ఈ కొబ్బరి చెట్టుకు మొదట్లో ఒక తలతోనే ఉందని, కొంత పెద్దదైన తర్వాత రెండుగా చీలి మరోతల ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులు, పెద్దలు ఈచెట్టును చూసి ఆనందంవ్యక్తం చేస్తున్నారు.
Author: Shivaganesh
-
రహదారికి అడ్డంగా వృక్షం.. తొలగించిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఒక భారీ వృక్షం ప్రధాన రహదారికి అడ్డంగా కూలింది. వృక్షం కారణంగా గంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
-
అత్యవసర సమయాల్లో వెంటనే సంప్రదించండి: ఎస్సై
ఖమ్మం: నేలకొండపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సంతోష్ తెలిపారు. చెరువులు, కుంటలు, వాగుల్లో చేపలు వేటకు వెళ్లొద్దన్నారు. కరెంటు స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా చెరువులో చేపల్లో వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 100 నెంబర్ లేదా 8712659138 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
-
ఉద్యోగులకు క్రీడా పోటీలు..
మెదక్: జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువజన, క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి, ఉద్యోగుల ఆటతీరును ప్రశంసించారు. చెస్, క్యారమ్, బ్యాడ్మింటన్ పోటీలలో దాదాపు 190 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. విజేతలకు ఆగస్టు 15న ప్రశంసాపత్రాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-
తనిఖీలు నిర్వహించిన అధికారులు
మెదక్: జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా చర్యలపై డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఆయన జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్‌రావుతో కలిసి చేగుంట మండలంలోని శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్, చిన్నశివనూర్, డెల్ ఎక్స్ ఎల్ ఫార్మా, కుచ్చారం పరిశ్రమలను పరిశీలించారు. తనిఖీ నివేదికలను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఆపండి ఆయన నా భర్త.. చివరి నిమిషంలో ఆగిన పెళ్లి..
మహబూబాబాద్: చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన డోర్నకల్‌లో బుధవారం వెలుగుచూసింది. సంగారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక మహిళ తన భర్త పచ్చిపాల మహేష్ రెండోపెళ్లి చేసుకుంటున్నాడని డోర్నకల్ సీఐకి ఫిర్యాదు చేయడంతో.. చివరినిమిషంలో పెళ్లి ఆపివేసి వరుడిని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఖమ్మంకు చెందిన వధువుతరపు బంధువులు తమని మోసం చేశారంటూ ఆందోళనకు దిగగా, పోలీసులు వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
-
గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి
ఆదిలాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమాధికారి బి.సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా ఆసక్తి, అర్హత గల ఎస్సీ విద్యార్థులు ఈ-పాస్ ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
-
ఉరేసుకొని యువరైతు ఆత్మహత్య
ఆదిలాబాద్: ఉరేసుకొని యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలం కిష్టాపూర్‌లో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన యువరైతు సొలంకి శ్రీకాంత్(26) కొన్నేళ్లుగా ఎకరం సొంత పొలంతోపాటు.. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సరైన దిగుబడిలేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసునమోదు చేసిట్లు పోలీసులు తెలిపారు.
-
పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: సీపీ
సిద్దిపేట: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కమిషనర్ అనూరాధ పిలుపునిచ్చారు. నశా ముక్త్ భారత్ అభియాన్ కార్య క్రమంలో భాగంగా ఆమె బుధవారం కమిషనరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100, 8712667100 నంబరుకు సమాచారం అందించాలన్నారు.
-
కల నిజమైంది.. నేడు ఇంజినీరింగ్ కాలేజీ ప్రారంభం
సిద్దిపేట: హుస్నాబాద్ ప్రాంతవాసుల చిరకాల వాంఛ నెరవేరి కార్యరూపం దాల్చనుంది. శాతవాహన ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం తరగతులు ప్రారంభంకానున్నాయి. తాత్కాలికంగా స్థానిక పాలిటెక్నిక్‌లో పైఅంతస్తులో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నూతన విద్యార్థులకు స్వాగత (ఓరియెంటేషన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమావతి, సీపీ అనూరాధ, వీసీ ఉమేశకుమార్ పాల్గొననున్నారు.