Author: Shivaganesh

  • ‘కాంగ్రెస్ పాలనలో రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి’

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలకేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన  మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.

     

  • ‘పోలీసుల అనుమతి తప్పనిసరి’

    ఖమ్మం: ముదిగొండ మండలంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఐ వడ్డేపల్లి మురళి స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై, ప్రజలకు ఇబ్బంది కలిగేలా మండపాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, విద్యుత్ శాఖ అనుమతి పత్రాలు కూడా సమర్పించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ప్రజల సహకారంతో అభివృద్ధి: మంత్రి పొంగులేటి

    ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగిస్తుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ధరణి స్థానంలో భూభారతి 2025 చట్టం తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

  • ‘యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం’

    మెదక్: నర్సాపూర్‌లో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల సమస్యను గమనించిన ఎమ్మెల్యే సునీతా రెడ్డి వెంటనే స్పందించారు. ఈసందర్భంగా ఆమె కలెక్టర్‌తో మాట్లాడి, రెండు లారీల యూరియాను నర్సాపూర్‌కు పంపాలని కోరారు. ఒక్కో రైతుకు రెండు లేదా మూడు బస్తాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారికి సూచించారు. రైతులకు సరిపడ యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

  • క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పెద్దగొల్లగూడెం క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లాల స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల సేవలను కొనియాడారు. ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

  • రహదారిపై వరద నీరు.. స్తంభించిన రాకపోకలు

    భద్రాద్రి కొత్తగూడెం: తూరుబాక వద్ద తాత్కాలిక డైవర్షన్ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు వాహనాలను ఆంధ్రలోని ఎటపాక నుంచి ములకపాడు వరకు మళ్లించారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు ఈ రహదారే ప్రధాన మార్గం. గోదావరి వరద పెరగడంతో పర్ణశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచి రాకపోకలు స్తంభించాయి.

  • తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

    హన్మకొండ: బాలాజీ బంజారా కాలనీ గుండ్లసింగారంలో గురువారం ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి మాట్లాడారు. గిరిజనులతో తనకు వీడదీయరాని బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పెళ్లి కాని యువతులకు మంచి అల్లుళ్లు రావాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, గిరిజనయువతులు పాల్గొన్నారు.

  • ఊహించని అతిథి.. ఉలిక్కిపడిన జనం..

    ములుగు: ఊహించని అతిథిలా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాడ్వాయి మండలం కాటాపూర్-అన్నారం గ్రామాల మధ్య బుధవారం అర్ధరాత్రి 10 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ప్రధాన రహదారిపై కొండచిలువను చూసిన పలువురు వాహనదారులు వెంటనే వాహనాలను నిలిపివేశారు. అదృష్టవశాత్తు కొండచిలువ సమీపంలోని అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

     

  • రేపటి నుంచి కొత్త అభివృద్ధి పనులు..

    మెదక్: జిల్లాలో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం కొత్త అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి పనులు ఏకకాలంలో మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

  • యూరియా కొరతతో రైతుల ఆందోళన

    మెదక్: నర్సాపూర్‌లో యూరియా కొరతతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా వరి పంటకు యూరియా అత్యవసరమని, కానీ గత 15 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, యూరియా మాత్రం లభించడం లేదని వాపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట నష్టపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు.