మెదక్: జిల్లాలో రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, ఏదైనా అత్యవసరం ఉంటే 9391942254 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ప్రభుత్వఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Author: Shivaganesh
-
‘గెలుపే లక్ష్యంగా పని చేయాలి’
ఖమ్మం: చింతకాని మండలం పాతర్లపాడులో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం సతీమణి నందిని విక్రమార్క పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఆమె సమక్షంలో పలు కుటుంబాలు పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
-
‘ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’
కుమ్రం భీం: కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ వెంకటేష్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశంపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వంటి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
-
రెడ్ అలర్ట్‌లో ఉమ్మడి వరంగల్..
వరంగల్: అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 13న రాష్ట్రంలో పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక తెలిపింది. జనగామ, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలందరూ అత్యవసరం అయితే తప్పా బయటికి రావద్దని అధికారులు సూచించారు.
-
‘మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు’
మెదక్: రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, అక్కన్నపేటలోని రైల్వే స్టేషన్‌లో ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
-
ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం..
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో వర్షం దంచికొడుతుంది. గడిచిన 24 గంటలలో మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో అత్యధికంగా 207.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కుమ్రంభీం జిల్లాలో దహెగాం మండలంలో 121.3 మిల్లీమీటర్ల, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ లో 65.5 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్ మండలంలో 27.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
-
ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు..
ఆదిలాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వస్తుండటంతో రెండు గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుమ్రంభీం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తి 1241 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
-
దంచికొడుతున్న వర్షం..
ములుగు: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షం దంచికొడుతుంది. తెల్లవారు జాము నుంచే ములుగు జిల్లాలోని మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో, భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, రేగొండ, ఘనపూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వరదకు గొల్లబుద్దారం ప్రభుత్వ పాఠశాల చెరువులను తలపిస్తుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గుఉత్పత్తి నిలిచిపోయింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
-
పాలేరు జలాశయం వద్ద సెల్ఫీలు బంద్: ఏసీపీ
ఖమ్మం: కూసుమంచి మండలం పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం దాటి ప్రవహిస్తుండటంతో 24 ఆటోమేటిక్ గేట్లు తెరుచుకున్నాయి. అలుగు ఉద్ధృతంగా పారుతున్న ఈ ప్రాంతంలో సెల్ఫీలు నిషేధిస్తున్నామని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. అలుగు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జలాశం వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోవద్దని ప్రజలను హెచ్చరించారు. జలాశయం వద్ద సెల్ఫీలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.
-
కీలక సూచనలు చేసిన సీఐ
జనగామ: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్, చిల్పూర్ మండలాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచనలు చేశారు. పాత ఇళ్లలో ఉండవద్దని, తెగిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని, వాగులు, వంతెనలు దాటవద్దని వద్దని కోరారు. అత్యవసరం అయితే తప్పా బయటకు వెళ్లకూడదని సూచించారు.