భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పెద్దగొల్లగూడెం క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లాల స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల సేవలను కొనియాడారు. ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
Author: Shivaganesh
-
రహదారిపై వరద నీరు.. స్తంభించిన రాకపోకలు
భద్రాద్రి కొత్తగూడెం: తూరుబాక వద్ద తాత్కాలిక డైవర్షన్ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు వాహనాలను ఆంధ్రలోని ఎటపాక నుంచి ములకపాడు వరకు మళ్లించారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు ఈ రహదారే ప్రధాన మార్గం. గోదావరి వరద పెరగడంతో పర్ణశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచి రాకపోకలు స్తంభించాయి.
-
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి
హన్మకొండ: బాలాజీ బంజారా కాలనీ గుండ్లసింగారంలో గురువారం ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి మాట్లాడారు. గిరిజనులతో తనకు వీడదీయరాని బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పెళ్లి కాని యువతులకు మంచి అల్లుళ్లు రావాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, గిరిజనయువతులు పాల్గొన్నారు.
-
ఊహించని అతిథి.. ఉలిక్కిపడిన జనం..
ములుగు: ఊహించని అతిథిలా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాడ్వాయి మండలం కాటాపూర్-అన్నారం గ్రామాల మధ్య బుధవారం అర్ధరాత్రి 10 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ప్రధాన రహదారిపై కొండచిలువను చూసిన పలువురు వాహనదారులు వెంటనే వాహనాలను నిలిపివేశారు. అదృష్టవశాత్తు కొండచిలువ సమీపంలోని అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
రేపటి నుంచి కొత్త అభివృద్ధి పనులు..
మెదక్: జిల్లాలో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం కొత్త అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి పనులు ఏకకాలంలో మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
-
యూరియా కొరతతో రైతుల ఆందోళన
మెదక్: నర్సాపూర్‌లో యూరియా కొరతతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా వరి పంటకు యూరియా అత్యవసరమని, కానీ గత 15 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, యూరియా మాత్రం లభించడం లేదని వాపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట నష్టపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు.
-
‘సరిపడ యూరియా అందుబాటులో ఉంది’
మెదక్: హవేలీ ఘన్‌పూర్ మండల వ్యవసాయ అధికారి శీలం బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలంలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. వచ్చే పది రోజుల్లో 1000 నుంచి 1500 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, సెప్టెంబర్‌లో కూడా యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. ఎవరూ కూడా కృత్రిమ కొరత సృష్టించవద్దని, అవసరం మేరకు మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
-
యూరియా కోసం రైతుల రాస్తారోకో
మహబూబాబాద్: మరిపెడ మండల కేంద్రంలో గురువారం యూరియా కోసం రైతులు రాస్తా రోకో చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పురుగు మందులను తీసుకుంటానే యూరియా ఇస్తామని ప్రైవేట్ డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధిక రేట్లకు పురుగు మందులను బలవంతంగా అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రైవేట్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు..
సంగారెడ్డి: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, ఐలాపూర్, ఐలాపూర్ తండాలకు వెళ్లే ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకొని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మాణిక్ యాదవ్ తన సొంత డబ్బులతో గుంతలను పూడ్చారు. ప్రభుత్వం స్పందించి తక్షణం గుంతలకు గురైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
-
పబ్జీ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య
నిర్మల్: పబ్జీ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బైంసాలో వెలుగుచూసింది. భైంసాలో నివాసం ఉంటున్న బేతిసంతోష్, సాయిప్రజ దంపతులకు తొమ్మిదవ తరగతి చవిన వారి కుమారుడు రిశేంద్ర ఉన్నారు. వారి కుమారుడు పబ్జీ ఆటకు బానిసై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో వారు ఆ ఆటను ఆపడంతో రిశేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.