మెదక్: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆయన బోధన్ రోడ్ గాంధీనగర్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను
పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్దేశిత గడువు తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Author: Shivaganesh
-
‘గడువులోగా పనులు పూర్తి చేయాలి’
-
దరఖాస్తుల ఆహ్వానం
కుమ్రంభీం: కాగజ్నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్ ఫొటోలతో ఈనెల 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.
-
‘రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలి’
జనగామ: ఈనెల 13లోగా రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి అంబికాసోని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన వారే అర్జీని అందజేయాలన్నారు. జూన్ 5లోగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు 2024 – 2025 సంవత్సరానికి బీమా పథకానికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు మధ్యలో జన్మించి, 18 – 59 లోపు వయసున్న వారే అర్హులని పేర్కొన్నారు.
-
‘ఈనెల 13లోపు దరఖాస్తులు చేసుకోవాలి’
మెదక్: ఈనెల 13లోపు రైతులందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024 – 25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్‌లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక రైతువేదికల్లో ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపడతారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
-
జోగినాథ గిరి ప్రదర్శన.. ఎక్కడంటే..
సంగారెడ్డి: జోగిపేట పట్టణంలోని జోగినాథ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదర్శనలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకు జోడు లింగాలకు అభిషేకం నిర్వహించి ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం శ్రయనస్కారం, భజన, తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
-
2 వేల క్యూసెక్కులు విడుదల..
భద్రాద్రి కొత్తగూడెం: కిన్నెరసాని రిజర్వాయర్ ఒక గేటు ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ.. ఎగువన కురిసిన వర్షాలకు కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరద నీరు చేరవడంతో దిగువకు నీరు వదులుతున్నామని పేర్కొన్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటిమట్టం 404.70 అడుగులకు చేరిందని అన్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-
దారుణం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
జయశంకర్ భూపాలపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం గణపురం మండలం కోటకాల్వ వద్ద చోటుచేసుకుంది. భూపాలపల్లి కారల్‌మార్క్స్ కాలనీకి చెందిన మార్వికు సుమదార్ జగదీశ్, దాసరి జగదీశ్ ఇద్దరు స్నేహితులు. వారు రామప్పకు వెళ్లితిరిగి వస్తున్న క్రమంలో గణపురం కోటకాల్వ మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో దాసరి జగదీశ్ (24) అక్కడికక్కడే మృతిచెందాడు. సుమదార్ జగదీశ్ తీవ్రంగా గాయపడ్డారు.
-
విద్యుత్తు వినియోగదారులకు అలర్ట్..
వరంగల్: ఏజేమిల్స్ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ఎస్.మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నర్సంపేటరోడ్, 100 ఫీట్ రోడ్, చెన్నారెడ్డికాలనీ, ఎస్.ఆర్టీ కాలనీ, లేబర్ కాలనీ ఏరియాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
-
13 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్..
ఖమ్మం: 13 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసిన ఘటన ఆదివారం వైరా పరిధిలో వెలుగుచూసింది. వైరా ఎస్సై రామారావు మాట్లాడుతూ.. సిరిపురం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద జూదం ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా.. 13 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4250, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
పవర్ కట్.. ఎక్కడంటే
మెదక్: చిలప్‌చెడ్ మండల పరిధి చిట్కుల్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సల్మాన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మండల పరిధిలోని చిట్కుల్, చండూర్, గౌతా పూర్, బంజారానగర్ గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.