Author: Shivaganesh

  • విద్యుత్తు సరఫరాలో అంతరాయం..

    మెదక్: కౌడిపల్లి మండల పరిధిలోని కంచన్పల్లి, భుజిరంపేట విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాలకు సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శరత్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకుఆయా  ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు, రైతులు గమనించి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • నేడు కలెక్టరేట్లో ప్రజావాణి..

    వరంగల్: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణిలో ప్రజలు పాల్గొని వారి సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు. గ్రేటర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు.

     

  • గ్యాస్ లీక్.. చెలరేగిన మంటలు

    ఆదిలాబాద్: గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ఘటన ఆదివారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సాయినాథ్ పెట్రోల్ పంపు సమీపంలోని ప్రధాన రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తుంటారు. అక్కడ పని చేసే వారు వంట చేసుకుంటుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

  • ‘స్పందించి సమస్యను పరిష్కరించండి’

    సంగారెడ్డి: పటాన్‌చెరు పట్టణ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో పారిశుద్ధ్యం లోపించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని స్థానిక ప్రజలు వాపోయారు. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఆఫీస్ ప్రధాన గేటు ముందు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోయిందని అన్నారు. వర్షం పడితే ఆఫీస్‌లోకి వెళ్లలేని దుస్థితిని నెలకొందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

  • రైతులకు అలర్ట్.. దరఖాస్తుకు ఆహ్వానం

    ఖమ్మం: భూమి పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందిన రైతులు ఆగస్టు 13లోగా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని నేలకొండపల్లి మండల వ్యవసాయాధికారిణి రాధ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు ఫారం, పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్‌తో సంబంధిత రైతు వేదికల్లో ఏఈవోల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • పేకాటరాయుళ్లు అరెస్ట్.. కేసు నమోదు

    ఆదిలాబాద్: పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలోని పర్కోట కాలనీలో వెలుగుచూసింది. పట్టణంలోని జూదం ఆడుతున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పట్టణానికి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13,050 నగదు, ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.సునిల్‌కుమార్ తెలిపారు.

     

  • ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్

    వరంగల్: డా.బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నట్లు సీకేఎం ప్రభుత్వ కళాశాల సహాయ కేంద్రం కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తులకు అర్హులని అన్నారు. ఆగస్టు 13వ తేదీలోపు ఆసక్తి ఉన్నవారు www.braouonline.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

  • ఏటీఎంలో చోరీకి యత్నం.. ఎక్కడంటే

    మెదక్: ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం డయల్ కార్డును డ్యామేజీ చేసి చోరీకి యత్నించాడు. దాంతో అలర్ట్‌కాల్ మొగడంతో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నిఖిల్ అక్కడికి వెళ్లి చూసేసరికి డయల్ ప్యాడ్ డ్యామేజ్ అయి ఉంది. ఆదివారం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు.

  • సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు మండలం పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు దశలవారీగా అందజేస్తానని, మంజూరైన వారు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు.

  • జర్నలిస్టు యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

    మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని గంగపుత్ర భవనంలో దళిత వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా వెల్తూరి పూర్ణచందర్, ఉపాధ్యక్షులుగా చింతకుంట్ల యాకాంబరం, జిన్నా లచ్చయ్య, తీగల ప్రేమ్‌సాగర్, మిట్ట కడుపులో మహేందర్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు సంఘం ముఖ్య సలహాదారులు మైదం శ్రీనివాస్, ధర్మరపు శ్రీను తెలిపారు.