Author: Shivaganesh

  • ‘ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి’

    మెదక్: టేక్మాల్ మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానిక పీహెచ్‌సీ పరిశీలించి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి.. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

     

     

  • కన్నీటితో కడసారి రాఖీ…

    మహబూబాబాద్: జిల్లాలో రాఖీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన తమ్ముడికి అక్కలు కడసారి రాఖీలు కట్టిన ఘటన కేసముద్రంలో వెలుగుచూసింది. కేసముద్రానికి చెందిన యాకయ్య అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. విషయం తెలిసిన ఐదుగురు అక్కలు కన్నీటితో తమ్ముడి ఇంటికి చేరుకుని మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టి బోరున విలపించారు. ఈ దృశ్యం గ్రామస్థులతో కంటతడి పెట్టించింది.

  • అర్జీలు స్వీకరించిన మంత్రి..

    మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలనలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిశీలించి, పరిష్కరించేలా చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • రాఖీ స్పెషల్.. వీళ్లకు ప్రత్యేకం..

    ఖమ్మం:  ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ ప్రాంతానికి చెందిన శ్రీను-కవిత దంపతులు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మరణించడంతో హైదరాబాద్ నుంచి ఓ శునకాన్ని తెచ్చి పెంచుకున్నారు. తమ కుమారుడిలాగే ఆ శునకాన్ని వాళ్లు పెంచారు. రాఖీ పండుగ సందర్భంగా వారి కుమార్తె లాస్య ఆ శునకానికి రాఖీ కట్టి మూగజీవిపై సోదర ప్రేమను చాటుకుంది.

     

  • రైతులు దరఖాస్తు చేసుకోండి..

    ఆదిలాబాద్: ఈనెల 13లోపు జిల్లా రైతులు కొత్త పట్టాపాస్‌బుక్‌లతో రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ సూచించారు. జిల్లాలోని 21 మండలాల్లోని 101 రైతువేదికల్లో ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపడతారని పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్‌లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

  • రాఖీలు కట్టి ఏడిపించారు.. ఏమైందంటే

    మహబూబాబాద్: కేసముద్రం మండల కేంద్రంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రానికి చెందిన చిలివేరు సమ్మయ్యకు అక్కాచెల్లెళ్లు  లేరు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న చిలివేరు సమ్మయ్యకు కాలనీవాసులు అందరూ కలిసి రాఖీలు కట్టారు. సోదరిమణుల ప్రేమను చూసి సమ్మయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

  • మంత్రి రాజనరసింహకు రాఖీ కట్టిన సోదరి..

    సంగారెడ్డి: రక్షాబంధన్ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనరసింహకు తన సోదరితో పాటు మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ లు రాఖీలు కట్టారు. అనంతరం వారు మంత్రి వారికి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి భార్య పద్మిని, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • వీరభద్రుడి సన్నిధిలో పైలట్ సంజన..

    సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపాలిటీ వీరన్నగూడెంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో శనివారం తెలంగాణ తొలి మహిళా పైలట్ సంజన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 10న తన పెళ్లి సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయాన్ని కుటుంబసభ్యులతో దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయాన్ని దర్శించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

  • ‘మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

    భద్రాద్రి కొత్తగూడెం:  అశ్వారావుపేటలో శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక  అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటించారు. ఈసందర్భంగా ఆయనకు స్థానిక పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలాని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • రెండు ట్రైన్స్‌లో సాంకేతిక లేపం.. పాపం ప్రయాణికులు

    మహబూబాబాద్: ఇంటికన్నె సమీపంలో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12705) శనివారంరాత్రి రెండుగంటలు నిలిచిపోయింది. రెండుబోగీల మధ్య ఉన్న బ్రేక్ పైపు పగలడంతో సాంకేతిక సమస్య తలెత్తి రాత్రి 8.10 నుంచి 10 గంటల వరకు ట్రైన్‌ను నిలిపివేశారు. కేసముద్రం రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలును గంటసేపు నిలిపారు. సమస్యను పరిష్కరించిన తర్వాత బయలుదేరిన ట్రైన్ మళ్లీ నెక్కొండ స్టేషన్‌లో 75 నిమిషాలు ఆగడంతో ప్రయాణికులు ఉసూరుమన్నారు.