Author: Shivaganesh

  • పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన తరగతి గదులను, వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. భోజనంలో కొత్త మెను విధానం కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం జరగకూడదని ఆదేశించారు.

  • చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన 180 మంది లబ్ధిదారులకు మంజూరైన ఒక 1.80 కోట్ల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

    మెదక్: నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద యూరియా అందకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ లింగం అక్కడికి వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. అరగంట లోపల యూరియా బస్తాలు అందజేయిస్తామని, వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడించడంతో రైతులు ధర్నాను విరివింప చేశారు. రోజురోజుకు యూరియా కష్టాలు పెరిగిపోతున్నాయని, అధికారులు సరిపడ యూరియాను ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా అందజేయాలని రైతులు కోరారు.

  • ‘సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం’

    మెదక్: నర్సాపూర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పురోహితుడు హరిప్రసాద్ శర్మ గురువారం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉంటుందన్నారు. ఈ గ్రహణాన్ని శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాల వారు చూడకూడదు. గ్రహణం కారణంగా వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ గ్రహణం మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనస్సు రాశుల వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు.

  • సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

    సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 35,303 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఐదు గేట్లు ఎత్తి 43,417 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.377 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

  • ‘నేను పెద్ద సారును’.. ఇందిరమ్మ ఇండ్లలో అధికారి చేతి వాటం

    సిద్దిపేట: ఇందిరమ్మ ఇండ్లలో ఓఅధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 18 ఇందిరమ్మ ఇళ్లకు ఓ మేస్త్రీ పనులు మొదలుపెట్టారు. ఈక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకన్న.. మేస్త్రీ వెంకటయ్యకు ఫోన్ చేసి ఒక్కోఇంటికి రూ.5 వేల నుంచి రూ.3వేల వరకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే మేస్త్రీ తన ఫోన్‌పే ద్వారా ఏఈకి డబ్బులు పంపించినట్లు తెలిపారు.

  • మడికొండలో నీటి సరఫరా బంద్..

    హన్మకొండ: మడికొండ గ్రామంలో గురువారం నుంచి రెండు రోజులు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు GWMC అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్ పైప్ లైన్ లీకేజీ కారణంగా ఈ సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి మరమ్మతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించిన వెంటనే నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.

  • జలదిగ్బంధంలోనే వన దుర్గామాత ఆలయం..

    మెదక్: ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో మంజీరానది పొంగిపొర్లుతుంది. దీంతో గత ఎనిమిది రోజుల నుంచి దుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం వైపు పెద్ద ఎత్తున మంజీరా నది వరదలు పారుతుండటంతో అటువైపు ఎవరిని అనుమతించకుండా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు.

  • పాము కాటుతో బాలుడి మృతి..

    కుమ్రం భీం: పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన  నవదీప్ (11)ని అర్ధరాత్రి పాము కాటు వేయగా వెంటనే తల్లిదండ్రులు కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక..

    ములుగు: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75 కుటుంబాలకు చెందిన 216 మందిని తరలించామన్నారు. నదీ తీర ప్రాంతాలకు వెళ్లకూడదని, వరద నీటిలో ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలన్నారు.