Author: Shivaganesh

  • కాజీపేట పోలీసుల నిఘా

    హన్మకొండ: నేరాల నియంత్రణకు కాజీపేట పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో కాజీపేట రైల్వే స్టేషన్‌కు వచ్చిపోయే ప్రయాణికుల్లో అనుమానిత వ్యక్తులకు సంబంధించి మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ డివైస్ ద్వారా పాత నేరస్థులను గుర్తించడం సులభమని పేర్కొన్నారు.

  • పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యేలు

    హన్మకొండ: జిల్లా పర్యటనకు శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈక్రమంలో వారు మంత్రితో చర్చించిన విషయాలు ఏంటనేది పేర్కొనలేదు.

  • తగ్గుతున్న తెల్లబంగారం ధరలు

    వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం రూ. 7,720 పలికిన క్వింటా పత్తి ధర, గురువారం రూ.7,660 కి తగ్గింది. శుక్రవారం మరింత తగ్గి రూ.7,620కి పడిపోయినట్లు రైతులు పేర్కొన్నారు. ఈసందర్భంగా వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు సరకులు తీసుకొని రావాలని సూచించారు.

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘ఉల్లాస్’

    వరంగల్: నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 1,61,613 మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నారని గుర్తించారు. HNKలో 28,904, WGL 29,739, ములుగు 7,581, BHPL 29,484, MHBD 35,768 మంది ఉన్నారు. ఇందులో భాగంగా ‘అందరికి చదువు-అందరి బాధ్యత’ అని నినాదం ఇచ్చాయి.

  • ఐదేళ్లుగా రూ.48 కోట్ల మేర బకాయిలు..

    వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఐదేళ్లుగా రూ.48 కోట్ల మేర నీటి పన్ను బకాయిలు ఉన్నాయని బల్దియా లెక్కలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో నగర పాలక సంస్థ సాధ్యమైనంత త్వరగా బకాయిలను ఇంటి యజమానుల నుంచి రాబట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూపాయికే కుళాయి అంటూ నల్లాలు ఇచ్చి.. మళ్లీ ఇప్పుడు పన్నులు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

  • ‘ప్రాముఖ్యతను నేటి తరాలకు తెలియజేయాలి’

    ఆదిలాబాద్: సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను నేటి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తున్న సమితి సభ్యులను అభినందించారు.

  • స్టేట్ లెవల్‌లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

    ఆదిలాబాద్: జనగామలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇద్దరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎం.హన్మంతు రజతం, వీ.దీక్షిత స్వర్ణ పతకాలతో రాష్ట్రస్థాయి కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో మెరిసారు. ఈసందర్భంగా వారిని డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ తదితరులు అభినందించారు.కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

  • ‘కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం’

    ములుగు: మల్లంపల్లి సమీపంలో బ్రిడ్జి కూలిపోవడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని జిల్లా బీఆర్‌ఎస్ నాయకుడు భూక్య జంపన్న విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పక్కనే నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం లోతైన తవ్వకాల కారణంగా పాత బ్రిడ్జి కూలిందని అన్నారు. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • కేంద్ర సహాయమంత్రికి ఎమ్మెల్యే వినతి

    భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు నుంచి రైలు సర్వీసుల పునరుద్ధరణ కోసం రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టుకు ఢిల్లీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 సమయంలో నిలిచిపోయిన నాలుగు రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. కూనవరం వద్ద కొత్త రైల్వేస్టేషన్ నిర్మించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్ పాల్గొన్నారు.

  • ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య

    మంచిర్యాల: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గంగాథారి వాణి(44) మిషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త శంకర్ తాగుడుకు బానిసై పని చేయడం లేదు. ఈక్రమంలో ఆమె శుక్రవారం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాగారం తెలిపారు.