Author: Shivaganesh

  • పాపం వృద్ధురాలు.. ఎక్కడి నుంచి వచ్చిందో!

    వరంగల్: నెక్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఓ వృద్ధురాలిని స్థానిక స్థానిక రైతులు శుక్రవారం గుర్తించారు. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఆమె గురువారం ఉదయం నుంచి అక్కడే ఉంటున్నట్లు తెలిపారు. రాత్రి వర్షంలో కూడా అక్కడే తడుస్తూ కనిపించినట్లు పేర్కొన్నారు. ఆమెకు తన వివరాలు సరిగ్గా చెప్పడం రావడం లేదని అన్నారు. ఆమెకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

  • డాక్టర్ సూసైడ్ కేసులో భర్తపై వేటు..

    వరంగల్: భర్త వేధింపులు తట్టుకోలేక జులై15న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రత్యూష సూసైడ్ ఘటనలో ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్‌పై వేటుపడింది. తాజాగా ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యూష సూసైడ్ కేసులో ప్రస్తతం ఆయన ప్రధాన నిందితుడిగా రిమాండ్‌లో ఉన్నారు.

  • అన్నదాతలకు అందుబాటులోకి డ్రైమిషన్..

    ఖమ్మం: నెలకొండపల్లి మండలంలో వర్షాకాలంలో ధాన్యం ఆరబెట్టడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డ్రై మిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో శుక్రవారం నెలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ.13.70 లక్షలతో డ్రైమిషన్ కొనుగోలు చేసింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు మాట్లాడుతూ.. రైతుల అవస్థలు తీర్చడానికి దీనిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

  • క్షుద్రపూజల కలకలం..!

    జయశంకర్ భూపాలపల్లి: క్షుద్రపూజలు కలకలం రేపిన ఘటన శుక్రవారం మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలుగుచూశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయం వెనక వైపు, హనుమాన్ ఆలయానికి సమీపంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు రహదారిపై నల్లకోడిని బలిచ్చి పూజలు జరిపిన ఆనవాళ్లతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

  • ఐదుగురిపై కేసు నమోదు.. ఎందుకంటే

    మంచిర్యాల: అక్రమంగా తీగ చెట్లు నరికిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. జన్నారం అటవీ రేంజ్ పైడిపల్లి బీట్‌లో రేంజ్ అధికారి సుష్మారావు, సెక్షన్ అధికారి శివకుమార్ సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. దుంగలతో వస్తున్న ఐదుగురిని గుర్తించి, వారిలో కండ్లే కమలాకర్‌ను అరెస్ట్ చేశారు. మైనేనితిరుపతి, డేగమహేష్, మైనేనిసురేష్, ఎండితహర్‌పాషా, కండ్లేకమలాకర్‌పై కేసునమోదు చేసినట్లు తెలిపారు.

  • రేర్.. ఒకే ఈతలో రెండు దూడలు

    సంగారెడ్డి: పాడి గేదేకు ఒకే ఈతలో రెండు దూడలు పుట్టిన ఘటన సదాశివపేట పట్టణంలో చోటుచేసుకుంది. సదాశివపేట పట్టణంలోని పాతకెరీ కాలనీకి చెందిన అలుగోల ఆంజనేయులు అనే రైతుకు చెందిన పాడి గేదేకు ఒకే కాన్పులో రెండు దూడలకు పుట్టాయి. సాధారణంగా ఒకే ఈతలో రెండు దూడలు పుట్టవని, తన గేదేకు ఇలా జరగడంపై రైతు సంతోషం వ్యక్తం చేశారు.

  • బుగ్గ వాగు ఉగ్ర రూపం…

    మహబూబాబాద్: డోర్నకల్ మండల కేంద్రంలోని బుగ్గవాగు ఉగ్ర రూపం దాల్చింది. గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈనేపథ్యంలో డోర్నకల్-లింగాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బుగ్గవాగు ఉగ్ర రూపం దాల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

  • ఆటోను ఢీకొన్న కారు.. పలువురికి తీవ్ర గాయాలు

    ములుగు: ఓ ఆటోను కారు ఢీకొన్న ఘటన శుక్రవారం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి జాతీయ రహదారి 163పై చోటుచేసుకుంది. ఒడిశా నుంచి వరినాట్ల కోసం వలస వచ్చిన కూలీలు ఐదుగురు ఆటోలో వెళ్తుండగా కారు ఢీకొనింది. ప్రమాదంలో కూలీలు, కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

  • భరోసా సెంటర్‌కు మూడేళ్లు..

    మెదక్: మెదక్ భరోసా సెంటర్ మూడు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పునర్వాసంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భరోసా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.

  • లోన్ పేరుతో మోసం.. కేసు నమోదు

    భద్రాద్రి కొత్తగూడెం: బ్యాంక్‌లోన్ పేరుతో మహిళను మోసం చేసిన ఘటన అశ్వారావుపేటలో వెలుగుచూసింది. నందమూరి కాలనీకి చెందిన హాలిమాకు లోన్ ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఇంటి లోన్‌కు సంబంధించిన పత్రాలు తీసుకున్నారు. ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో, ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించగా.. డబ్బులు మధ్యవర్తుల ఖాతాలోకి బదిలీ అయినట్లు తేలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.