Author: Shivaganesh

  • యూరియా కొరతతో రైతుల ఆందోళన

    మెదక్: నర్సాపూర్‌లో యూరియా కొరతతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా వరి పంటకు యూరియా అత్యవసరమని, కానీ గత 15 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, యూరియా మాత్రం లభించడం లేదని వాపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట నష్టపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు.

  • ‘సరిపడ యూరియా అందుబాటులో ఉంది’

    మెదక్: హవేలీ ఘన్‌పూర్ మండల వ్యవసాయ అధికారి శీలం బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండలంలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. వచ్చే పది రోజుల్లో 1000 నుంచి 1500 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, సెప్టెంబర్‌లో కూడా యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. ఎవరూ కూడా కృత్రిమ కొరత సృష్టించవద్దని, అవసరం మేరకు మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • యూరియా కోసం రైతుల రాస్తారోకో

    మహబూబాబాద్: మరిపెడ మండల కేంద్రంలో గురువారం యూరియా కోసం రైతులు రాస్తా రోకో చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పురుగు మందులను తీసుకుంటానే యూరియా ఇస్తామని ప్రైవేట్ డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధిక రేట్లకు పురుగు మందులను బలవంతంగా అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రైవేట్ డీలర్ల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు..

    సంగారెడ్డి: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, ఐలాపూర్, ఐలాపూర్ తండాలకు వెళ్లే ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకొని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మాణిక్ యాదవ్ తన సొంత డబ్బులతో గుంతలను పూడ్చారు. ప్రభుత్వం స్పందించి తక్షణం గుంతలకు గురైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.

  • పబ్జీ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

    నిర్మల్: పబ్జీ గేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బైంసాలో వెలుగుచూసింది. భైంసాలో నివాసం ఉంటున్న బేతిసంతోష్, సాయిప్రజ దంపతులకు తొమ్మిదవ తరగతి చవిన వారి కుమారుడు రిశేంద్ర ఉన్నారు. వారి కుమారుడు పబ్జీ ఆటకు బానిసై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో వారు ఆ ఆటను ఆపడంతో రిశేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

     

  • పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన తరగతి గదులను, వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. భోజనంలో కొత్త మెను విధానం కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం జరగకూడదని ఆదేశించారు.

  • చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన 180 మంది లబ్ధిదారులకు మంజూరైన ఒక 1.80 కోట్ల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

    మెదక్: నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద యూరియా అందకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ లింగం అక్కడికి వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. అరగంట లోపల యూరియా బస్తాలు అందజేయిస్తామని, వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడించడంతో రైతులు ధర్నాను విరివింప చేశారు. రోజురోజుకు యూరియా కష్టాలు పెరిగిపోతున్నాయని, అధికారులు సరిపడ యూరియాను ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా అందజేయాలని రైతులు కోరారు.

  • ‘సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం’

    మెదక్: నర్సాపూర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పురోహితుడు హరిప్రసాద్ శర్మ గురువారం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉంటుందన్నారు. ఈ గ్రహణాన్ని శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాల వారు చూడకూడదు. గ్రహణం కారణంగా వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ గ్రహణం మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనస్సు రాశుల వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు.

  • సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

    సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 35,303 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఐదు గేట్లు ఎత్తి 43,417 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.377 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.