మెదక్: రామాయంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె భూభారతి రెవెన్యూ సదస్సులో రైతులు అందజేసిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పలు రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో రజనీకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ..
మెదక్: రామాయంపేట మండల కేంద్రంలో గురువారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 1778 కొత్త రేషన్ కార్డ్స్, 3396 కొత్త సభ్యుల పేర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులను స్థానిక రైతు వేదిక ఆవరణలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
-
‘పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి’
మెదక్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేదిక, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
-
నిర్లక్ష్యానికి పరాకాష్ట.. ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన
ఖమ్మం: నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన ఘటన బుధవారం కూసుమంచి మండలంలో వెలుగుచూసింది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, లక్ష్మి (మమత) దంపతులు వారి కుమార్తె జనన ధ్రువీకరణపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే, మండల తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో మరణ ధ్రువీకరణపత్రం జారీ చేశారు. బాధితులు ప్రశ్నించగా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
-
‘ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి’
మెదక్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈనెల 11న 01 – 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,92,695 మంది పిల్లలను గుర్తించామని, వారి కోసం 2,11,964 మాత్రలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
-
‘ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లిన గొప్పవ్యక్తి’
మెదక్: చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుధవారం తపస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ దాకా తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి అని అని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు వెంకటేష్, సుమతి, తదితరులు పాల్గొన్నారు.
-
రాఖీకి ఆర్టీసీ స్పెషల్ గిఫ్ట్..
ఆదిలాబాద్: రాఖీ పండగ, వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆర్టీసీ డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ రీజినల్ మేనేజరు భవానీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి రీజియన్‌లోని అన్ని డిపోలకు 46 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 10, 11, 12 తేదీల్లో తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు 72. బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
-
నేడు ఎంపిక జాబితా విడుదల..
ఖమ్మం: తెలంగాణ వైద్యవిధానపరిషత్తు ఆసుపత్రుల్లో వైద్యనిపుణుల ఖాళీల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. అభ్యర్థులను డీసీహెచ్ఎస్ రాజశేఖర్, డీఆర్, పద్మశ్రీ. ఏఓ శ్రీనివాస్, డా.మోత్యా, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్ ఇంటర్వ్యూ చేశారు. 16 పోస్టులకు 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైనవారి జాబితాను గురువారం ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
-
హత విధి.. ఏంటీ పరిస్థితి?
హన్మకొండ: ఈ చిత్రంలో కనిపిస్తున్న కూర గాయలను చూస్తే ఇవి మార్కెట్లో కుళ్లిపోయినవి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ చిత్రాలు సాక్ష్యాత్తు కాకతీయ విశ్వవిద్యాలయంలోని వసతిగృహాలు, మెస్లలో విద్యార్థుల వంట తయారీకి వినియోగించడానికి తెచ్చినవి. నాణ్యతలేని వంట సామగ్రి, కుళ్లిన కురగాయలు సరాఫరా జరుగుతున్నాయని, మెస్ల నిర్వ హణపై నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
-
మొదలైన సందడి.. విశేషం ఏమిటంటే..!
మెదక్: రామాయంపేట మండల కేంద్రంలోని రాఖీ పండుగ సందడి మొదలైంది. శనివారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలో పెద్ద సంఖ్యలో రాఖీ దుకాణాలు ఏర్పాటు చేశారు. మహంకాళి వీధిలో పెద్ద ఎత్తున రాఖీ షాపులు వెలిశాయి. సాంప్రదాయ రాఖీలతో పాటు, కొత్తకొత్త వెరైటీలతో ప్రజలను ఆకర్షించే విధంగా రాఖీలు అందుబాటులో ఉన్నట్లు షాపుల నిర్వాహకులు తెలిపారు.