Author: Shivaganesh

  • ‘నేను పెద్ద సారును’.. ఇందిరమ్మ ఇండ్లలో అధికారి చేతి వాటం

    సిద్దిపేట: ఇందిరమ్మ ఇండ్లలో ఓఅధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 18 ఇందిరమ్మ ఇళ్లకు ఓ మేస్త్రీ పనులు మొదలుపెట్టారు. ఈక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకన్న.. మేస్త్రీ వెంకటయ్యకు ఫోన్ చేసి ఒక్కోఇంటికి రూ.5 వేల నుంచి రూ.3వేల వరకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే మేస్త్రీ తన ఫోన్‌పే ద్వారా ఏఈకి డబ్బులు పంపించినట్లు తెలిపారు.

  • మడికొండలో నీటి సరఫరా బంద్..

    హన్మకొండ: మడికొండ గ్రామంలో గురువారం నుంచి రెండు రోజులు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు GWMC అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్ పైప్ లైన్ లీకేజీ కారణంగా ఈ సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి మరమ్మతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించిన వెంటనే నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.

  • జలదిగ్బంధంలోనే వన దుర్గామాత ఆలయం..

    మెదక్: ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో మంజీరానది పొంగిపొర్లుతుంది. దీంతో గత ఎనిమిది రోజుల నుంచి దుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం వైపు పెద్ద ఎత్తున మంజీరా నది వరదలు పారుతుండటంతో అటువైపు ఎవరిని అనుమతించకుండా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు.

  • పాము కాటుతో బాలుడి మృతి..

    కుమ్రం భీం: పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన  నవదీప్ (11)ని అర్ధరాత్రి పాము కాటు వేయగా వెంటనే తల్లిదండ్రులు కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక..

    ములుగు: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75 కుటుంబాలకు చెందిన 216 మందిని తరలించామన్నారు. నదీ తీర ప్రాంతాలకు వెళ్లకూడదని, వరద నీటిలో ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలన్నారు.

  • నేడు మంత్రి పొంగులేటి పర్యటన

    ఖమ్మం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్య టించనున్నారు. ఉదయం 11 గంటలకు తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు, పిండిప్రోలులో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు, నేలకొండల్లి మండలం బోదులబండల హైస్కూల్లో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

  • 13 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ..

    వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎస్.వెంకన్నను దేవరుప్పుల పీఎస్‌కు, జి.శ్రీదేవిని వరంగల్ సీసీఎస్‌కు, ఎం.రాజును ముల్కనూరుకు బదిలీ చేశారు. అలాగే పలువురు ఎస్సైలను వర్ధన్నపేట, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్, సీసీఎస్‌లకు బదిలీ చేశారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందజేయాలని సూచించారు.

     

     

  • గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్

    ఆదిలాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన షేక్‌మసూద్, మహారాష్ట్రలోని బోకర్ తాలుకా చిక్కల్వాడికి చెందిన జుబేర్ ఫారుక్‌పఠాన్‌ గంజాయి విక్రయిస్తుండగా టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ అరెస్ట్ చేశారు. వారి నుంచి 243 గ్రాముల ఎండు గంజాయి సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత అపరాధ రుసుముతో ఈ నెల 26 నుంచి 31వరకు గడువు ఉందని తెలిపారు. వివరాల కోసం అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

     

  • వనదుర్గాభవానికి ప్రత్యేక పూజలు

    మెదక్: పాపన్నపేట మండలం నాగసానుపల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారిని రాజగోపురంలో ఏర్పాటు చేసి దర్శనం కల్పించారు. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. భక్తులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.