హన్మకొండ: జిల్లా కేంద్రంలో నూతన వెల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు. ఈసందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
చెక్కులు అందజేసిన మంత్రి
సిద్దిపేట: కోహెడ రైతువేదికలో ఆదివారం నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కాటమయ్య రక్షణ కవచాలు, మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
-
బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
హన్మకొండ: గ్రేటర్ పరిధిలోని 65వ డివిజన్ నిపూర్‌నగర్ తండా మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య ఫిల్లింగ్ స్టేషన్‌ను ఆదివారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని యజమానులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.
-
‘ఆరోగ్యంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చు’
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌పై నిర్వహించిన మూడవ విడత హాఫ్ మారథాన్ పరుగును ఆదివారం ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలందరికి అవగాహన రావడం ముఖ్యమన్నారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
-
సారూ.. దయ చూపండి
మెదక్: చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ తండాకు చెందిన ధరావత్ ఈర్య (70), తారి (58) దంపతులు పింఛన్ కోసం పలు మార్లు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వారికి పింఛన్ మంజూరు కాలేదు. ఇటీవల వారి కుమారుడు లక్ష్మణ్‌కు వివాహం జరగ్గా, ఆయన స్థానికంగా పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమకు పింఛన్ మంజూరు చేయాలని వారు అధికారులను కోరారు.
-
‘అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు’
మెదక్: శివంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవ్వరూ కూడా చెరువులు, కుంటల వద్దకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని సూచించారు. విద్యుత్తు మోటార్ల వద్ద, వైర్ల విషయంలో జాగ్రత్త వహించాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటొద్దని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దని కోరారు.
-
జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రారంభం
హన్మకొండ: వరంగల్‌లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయనను జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వల్లాల వెంకటరమణ, TUWJ ( iju) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెళ్లి మధు, కంకణాల సంతోష్, పెండెం వేణుమాధవ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
-
అభిమానులతో ‘పోడెం’ సమావేశం
మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో ఆదివారం రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పోడెం వీరయ్య తన అభిమానులు, స్థానిక నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదు నుంచి భద్రాచలం వెళ్తూ కొత్తగూడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో వారితో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
సిద్దిపేట: కోహెడ నుంచి తంగలపల్లి క్రాస్ రోడ్డు వయా కూరెళ్ల వరకు రూ.1.55 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.హైమవతి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేడంలింగమూర్తి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నిర్మలా జయరాజ్, అధికారులు పాల్గొన్నారు.
-
నేడు మొగుళ్లపల్లిలో కేటీఆర్ పర్యటన
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించనున్నారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కొడారి రమేశ్ తండ్రి కొమురయ్య విగ్రహాన్ని ఉదయం 11: 30 గంటలకు కేటీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు మొగుళ్లపల్లిలోని శ్రీలక్ష్మీసాయి గార్డెన్స్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు నాయకులు తెలిపారు.