Author: Shivaganesh

  • వాగును సందర్శించిన ఆర్డీఓ

    మెదక్: హవేలీ ఘన్పూర్ మండలం ధూప్ సింగ్ తండా వాను శనివారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ నీటి ప్రవాహం కారణంగా వాగు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దూప్ సింగ్ తండాకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు.

  • రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు

    మెదక్: రామాయంపేట మండల పరిధిలోని శివాయపల్లి, కోమటిపల్లి, రామాయంపేట గ్రామల్లోని వరి, మొక్కజొన్న పత్తి పంటలను శనివారం మండల వ్యవసాయ అధికారి రాజునారాయణ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట మడుల్లో నిలిచిన నీటిని బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. అధిక వర్షాలతో తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

  • సింగరేణిలో ప్రమాద బీమా సౌకర్యం

    జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి సంస్థ గతంలో ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి జాతీయ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో ప్రమాదబీమా పెంచడానికి సింగరేణి యాజమాన్యం గతంలో ఒప్పందం చేసుకుందని. ఉద్యోగులకు బీమాసౌకర్యం అమలు చేయనున్నట్లు భూపాలపల్లి సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి తెలిపారు. ఉద్యోగులు, ఆయా బ్యాంకుల్లో ఖాతాలుతెరిచి ప్రమాద బీమా సౌకర్యం పొందాలని సూచించారు.

     

  • సీడీపీఓగా నియామక పత్రం అందుకున్న అలేఖ్య

    మెదక్: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన మాసాయిపేట అలేఖ్య (D/O) మల్లేశం సీడీసీఓగా ఉద్యోగం సాధించారు. ఈసందర్భంగా శనివారం ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సీడీపీఓగా నియమిస్తూ మంత్రి సీతక్క నియామక పత్రాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన అలేఖ్య సీడీపీఓగా ఉద్యోగం సాధించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

  • రామాయంపేట తండాలో అవగాహన కార్యక్రమం

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రామాయంపేట తండాలో శనివారం తెలంగాణ సంస్కృతిక కళాబృందం సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని పాట రూపంలో అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • వాగులో పడి ఒకరి మృతి

    మహబూబాబాద్: ప్రమాదవశాత్తు వాగులో పడి ఒకరు మృతి చెందిన ఘటన గూడూరు మండలం కోబల్ తండాలో వెలుగుచూసింది. తండాకు చెందిన బాలు అనే వ్యక్తి రాళ్ల వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

     

  • అంత్యక్రియల కోసం ఊరికి వెళ్తే.. చోరీ చేశారు

    వరంగల్: పరకాలలో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న చేరు కుమారస్వామి ఈనెల 21న మృతి చెందగా.. స్వగ్రామం భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం మృతుడి బావమరిది యుగేందర్ పరకాలలోని ఇంటికి వచ్చిచూడగా, తాళంధ్వంసం చేసి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • నేడు వారికి రాత పరీక్ష..

    హన్మకొండ: హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం గ్రామ పరిపాలన అధికారి (జీపీవో), లైసెన్స్‌డ్ సర్వేయర్ అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 300 మంది లైసెన్స్ డ్ సర్వేయర్ అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా, 37 మంది జీపీవో అభ్యర్థులకు ఉదయం మాత్రమే పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

  • దరఖాస్తుల ఆహ్వానం.. దేనికంటే

    వరంగల్: కాకతీయ ప్రభుత్వ కళాశాలలో రాజనీతిశాస్త్రం విభాగంలోని మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 లోపు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, 30న ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9948857826 నంబరును సంప్రదించాలన్నారు.

  • తనిఖీల్లో ఎండు గంజాయి సీజ్..

    సంగారెడ్డి: మునిపల్లి: అక్రమంగా తరలిస్తున్న ఎండుగంజాయి, మద్యం సీసాలను శనివారం సంగారెడ్డి టాస్క్‌ఫోర్స్, అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, నలుగురు యువకులు ఆటోలో 500 గ్రాముల గంజాయి తరలిస్తుండగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి, గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు. గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 3.3 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.