Author: Shivaganesh

  • ‘9 గంటల్లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి’

    సంగారెడ్డి: గ్రామ పాలనాధికారుల పోస్టుల పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు 88 మంది హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల్లోపు కేంద్రానికి చేరుకో వాలని సూచించారు.

  • నేడు లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఎంపిక పరీక్ష 

    సంగారెడ్డి: తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఎంపికకు పరీక్ష నిర్వహించనున్నట్లు భూకొలతలు సర్వే శాఖ ఏడీ ఇనేష్ పేర్కొన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 160 మందికి హాల్ టికెట్లు జారీ చేశామని, వీరందరూ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని ఆయన సూచించారు.

  • ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి

    వరంగల్: ప్రమాదవశాత్తు ఉర్సు చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం వెలుగుచూసింది. కరీమాబాద్ బీరన్నకుంటకు చెందిన వరికప్పుల రాజు(35) ప్లాస్టిక్ వస్తువులు, చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉర్సు చెరువునీటిలో కొట్టుకువచ్చిన వస్తువులను తీసుకునే ప్రయత్నం చేసిన ఆయన కాలుజారీ నీటిలో పడిపోయారు. శనివారం చెరువులో ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

     

  • జిల్లా స్థాయి చదరంగం పోటీలు.. ఎప్పుడంటే

    వరంగల్: హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకల మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో ఆగస్టు 3న ఓపెన్ టూ ఆల్ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు వరంగల్ చదరంగం సంఘం ప్రతినిది కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు, వ్యక్తిగత పతకాలు అందజేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 00595 22986 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

     

  • నేడు ఓరుగల్లులో ఎమ్మెల్సీ కవిత పర్యటన

    వరంగల్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఓరుగల్లు పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం హన్మకొండకు చేరుకొని, 1 గంటకు వడ్డేపల్లిలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డు రోజ్‌గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అనంతరం చెన్నారావుపేట మండలంలోని పాత ముగ్ధుంపురం గ్రామంలో పోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి హాజరై, బోనాల వేడుకలో పాల్గొంటారు. కవిత పర్యటనను విజయవంతం చేయాలని జాగృతి నాయకులు పిలుపునిచ్చారు.

  • దరఖాస్తుల ఆహ్వానం

    మెదక్: రేగోడ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్వో స్వయంప్రభ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు విద్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • వచ్చేనెల 22న అవగాహన సదస్సు

    మెదక్: ఆగస్టు 22, 23 తేదీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ దిశగా పాలనలో మార్పులపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. కళాశాల, భారత సామాజిక శాస్త్ర పరిశోధన మండలి- దక్షిణ ప్రాంత కేంద్రం సంయుక్తంగా జాతీయ సెమినార్ నిర్వహిస్తోందని తెలిపారు. సదస్సుకు విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఐసీఎస్ ఎస్ ఆర్-డైరెక్టర్ సుధాకర్ రెడ్డి హాజరవుతారని వివరించారు.

  • పరీక్షల టైం టేబుల్ విడుదల

    వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరీక్షల టైంటేబుల్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. ఆగస్టు 22న డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ చివరి సంవత్సరం పరీక్షలు, 29న రెండో సంవత్సరం పరీక్షలు, 25 నుంచి మొదటి సంవత్సర పరీక్షలు ఉంటాయన్నారు. పీజీడీసీఏ, డిప్లొమా ఇన్‌యోగా, లైబ్రరీ సైన్స్ పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు.

  • రైతులకు అవగాహన సదస్సు

    మెదక్: నార్సింగి రైతు వేదికలో శనివారం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖా అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ పంటను నాటిన నాలుగు సంవత్సరాల తర్వాత 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అని తెలిపారు. ఇది ఒక శాశ్వత ఆదాయ మూలంగా మారుతుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.

  • కిక్ బాక్సింగ్ లీగ్‌కు బయలుదేరిన విద్యార్థులు

    జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రానికి చెందిన షావులీన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు శనివారం కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలకు బయలుదేరారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025-26 పోటీలలో తమ విద్యార్థులు పాల్గొననున్నట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.